12న జాతీయ సమ్మెకు సంపూర్ణ మద్దతు
● సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ
విజయనగరం గంటస్తంభం: కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని కోరారు. రైతు వ్యతిరేక చట్టాలు, పెరుగుతున్న ధరలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చే విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ దేశభక్తి యుత సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో సీపీఎం ప్రత్యక్షంగా పాల్గొంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.


