కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!
● 18–45 ఏళ్లలో పథకంలో చేరితే..
60 ఏళ్ల తర్వాత రూ.3వేలు
● జిల్లాలో 10,234 మంది కార్మికుల నమోదు
విజయనగరం గంటస్తంభం: రోజూ కష్టపడి పని చేసే అసంఘటిత రంగ కార్మికుడికి వృద్ధాప్యంలో ఆర్ధిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం శ్రమ యోగి మాన్ ధన్, లఘువ్యాపారి మాన్ ధన్ పెన్షన్ పథకాలను అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్లలోపు అర్హులైన వారు ఈ పథకాల్లో చేరితే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెల రూ.3 వేల పెన్షన్ నేరుగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది.
తక్కువ చందాతో జీవిత భరోసా..
నెలకు కేవలం రూ.55 నుంచే చందా చెల్లించి భవిష్యత్తుకు భద్రత పొందవచ్చు. లబ్ధిదారుడు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 10,234 మంది కార్మికులు ఈ పథకాలలో నమోదు అయ్యారు.
అర్హులు ఎవరంటే...
శ్రమ యోగి మాన్ ధన్ పథకానికి వీధి వ్యాపారులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు అర్హులు. నెలసరి ఆదాయం రూ.15వేల లోపు ఉండి, ఈఎస్‌ఐ, ఈసీఎఫ్ లేని వారు ఈ పథకంలో చేరవచ్చు. లఘువ్యాపారి మాన్ ధన్ పథకానికి చిన్న దుకాణ యజమానులు, స్వయం ఉపాధిదారులు, రిటైల్ వ్యాపారులు, హోటల్ యజమానులు అర్హులు.
కుటుంబానికీ రక్షణ
ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేలు పెన్షన్ లభిస్తుంది. పెన్షనుదారు మృతి చెందితే జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ జీవితకాలం అందుతుంది.
నమోదు విధానం
సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (మీ–సేవ) ద్వారా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, నామినీ ఆధార్‌తో నమోదు చేసుకోవచ్చు.
కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!
కార్మికా.. రేపటి భద్రత మర్చిపోవద్దు..!


