హ్యాకథాన్‌లో జీఎంఆర్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
రాజాం సిటీ: విజయవాడలో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ ఫైనల్స్‌లో జీఎంఆర్ ఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ శనివారం తెలిపారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా మండలి పది ప్రొబ్లమ్ స్టేట్‌మెంట్ల్‌పై నిర్వహించిన ఈ పోటీల్లో దేశం నలుమూలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఒక్కొక్క ప్రొబ్లం నుంచి 12 టీంలను ఫైనల్స్‌కు ఎంపిక చేశారని, అందులో తమ విద్యార్థులు రూపొందించిన క్వాంటమ్ స్టేట్ విజువలైజర్ అనే ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్విబిట్స్, సూపర్ పొజిషన్, ఎంటాంగిల్‌మెంట్ వంటి క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక భావాలను సులభంగా, దృశ్య రూపంలో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి రూ.50 వేలు చెక్కుతో పాటు విజేతలకు జ్ఞాపికలు అందజేశారని తెలిపారు. విద్యార్థుల ప్రతిభ పట్ల జీఎంఆర్ వీఎఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, సీఈసీ విభాగం నుంచి డాక్టర్ ఏవీ రమణ తదితరులు అభినందించారు.


