పేదలకు పట్టాలిచ్చే వరకు పోరాడుతాం
విజయనగరం టౌన్: పేదలకు పట్టాలిచ్చే వరకు పోరాడుతామని పట్టణ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, అధ్యక్షుడు నీలాపు అప్పలరాజు రెడ్డి, రెడ్డి నారాయణరావులు అన్నారు. ఇదే విషయమై ధర్మపురిలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత కొన్నాళ్లుగా పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున మరుగున పడిన ప్రభుత్వ భూమిని గుర్తించి వెలికితీశామని, గ్రామంలోని నిరుపేదలకు ఎక్కడో ఇళ్లస్థలాల పట్టాలు ఇవ్వడం కన్నా గ్రామంలోనే ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వచ్చి ఆ స్థలాన్ని చూసి వెళ్లారన్నారు. గతంలో ఆమెకు కూడా వినతిపత్రం ఇచ్చామని, అందుకే వచ్చి చూశారేమోనని సంతోష పడ్డామన్నారు. నాలుగో తేదీన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వచ్చి మళ్లీ ఆ స్థలం చూశారని, అక్కడ టీడీపీ జిల్లా కార్యాలయం కడతారని తమకు తెలిసిందన్నారు. అది వాస్తవమో అవాస్తమో తెలియదు గానీ ఎమ్మార్వోను అడిగితే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో చూపించమన్నారని, అందుకే ఆ స్థలాన్ని చూపించామన్నారన్నారు.


