మన్యంలో సికిల్‌ సెల్‌ సెగ..! | - | Sakshi
Sakshi News home page

మన్యంలో సికిల్‌ సెల్‌ సెగ..!

Feb 7 2026 2:04 PM | Updated on Feb 7 2026 2:04 PM

మన్యంలో సికిల్‌ సెల్‌ సెగ..!

మన్యంలో సికిల్‌ సెల్‌ సెగ..!

మన్యంలో సికిల్‌ సెల్‌ సెగ..!

పార్వతీపురం రూరల్‌: గిరిజన హృదయాల్లో ప్రాణాంతక సికిల్‌సెల్‌ ఎనీమియా నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తూ, గిరిపుత్రుల ప్రాణాలను హరిస్తోంది. జన్యుపరంగా సంక్రమించే ఈ మహమ్మారి బారిన పడి పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు విలవిలలాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో బాధితులకు కొండంత అండగా నిలిచిన ప్రత్యేక వైద్యసేవలు నేడు ’బాబు ’ పాలనలో అటకెక్కాయి. ఐటీడీఏ నిధుల విడుదలలో చూపుతున్న జాప్యం, పాలకుల అలసత్వం వెరసి..గిరిజనుల రక్తం తెల్లబారుతోంది.

పంజా విసురుతున్న సికిల్‌సెల్‌

జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నాలుగు పూర్తిగా నాలుగు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలో ఉండగా, ఇక్కడ సికిల్‌సెల్‌ రక్కసి పంజా విసురుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 304 మందికి వ్యాధి నిర్ధారణ కాగా, మరో 4,808 మందిని ఈ వ్యాధి వాహకులుగా గుర్తించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వారికి ప్రతి నెలా రక్తమార్పిడి, నిరంతర వైద్య పర్యవేక్షణ ప్రాణావసరం. కానీ, దురదృష్టవశాత్తు జిల్లాలో ఉన్న ఏకై క ప్రత్యేక ’డే కేర్‌ సెంటర్‌’ నిధులు లేక రెండేళ్లుగా మూతపడి ఉండడం గమనార్హం. గతంలో ప్రత్యేక వైద్యులు, సిబ్బందితో సేవలు అందించేందుకు ఉన్న కేంద్రం, నేడు పాలకుల నిర్లక్ష్యం వల్ల వెలవెలబోతోంది.

జనరల్‌ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి

ఒకప్పుడు బాధితులకు నేరుగా రక్తమార్పిడి, ఉచిత మందులు, సలహాలు అందించే ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పుడు బాధితులు సాధారణ రోగుల మాదిరిగా జనరల్‌ వార్డుల్లో పడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రత్యేక విభాగం లేకపోవడంతో గర్భిణులు, కౌమార బాలికల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. నెలకు కేవలం రూ. 30 లక్షల నిధులు కేటాయించలేక, గిరిజనుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సర్కారు, ఏజెన్సీలో కొడిగడుతున్న ప్రాణాలను కాపాడడంలో ఎందుకు విఫలమవుతోందని గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. తక్షణమే ఐటీడీఏ నిధులు విడుదల చేసి, ప్రత్యేక చికిత్స కేంద్రాన్ని పునఃప్రారంభించాలని కోరుతున్నాయి.

కేంద్రాస్పత్రిలో అవసరమైన సేవలు

జిల్లా కేంద్రాస్పత్రిలో సికిల్‌సెల్‌ బాధితులకు అవసరమైన అన్ని వైద్య సేవలు నిరంతరం అందుతున్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం రక్తమార్పిడి అవసరమైన వారికి కేంద్రాస్పత్రిలో సేవలు అందుతున్నాయి. డే కేర్‌ సెంటర్‌కు ప్రతిపాదనలు పంపించాం. చికిత్స అందించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదు. వ్యాధిగ్రస్తులకు క్షేత్రస్థాయిలోనే పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యం అందేలా పర్యవేక్షణ చేస్తున్నాం.

డా.ఎం.వినోద్‌ కుమార్‌ ప్రత్యేకాధికారి

గిరిజనుల ప్రాణం..గాలిలో దీపం

మూతపడిన ఏకై క భరోసా కేంద్రం..

పట్టించుకోని చంద్రబాబు సర్కారు

నిధులు నిలిపివేత..వైద్యం అందక

గిరిపుత్రుల విలవిల

జిల్లాలో 304 మంది వ్యాధిగ్రస్తులు..

మరో 4,808 మంది వాహకులు

రక్తమార్పిడి లేక..మందులు దొరక్క

నరకయాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement