డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడి మృతి
బొబ్బిలి: చిన్న పిల్లాడిని కుక్క కరిచింది చూడండి బాబూ అంటే వాక్సిన్లు వేసిన వైద్యులు తిరగబెట్టిందని మళ్లీ వస్తే కేజీహెచ్‌కు తీసుకెళ్లమన్నారు. ఇక్కడే చికిత్స చేయడమో లేక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుపొమ్మనో చెబితే మా కుమారుడు బతికేవాడని దిబ్బగుడ్డివలస గ్రామానికి చెందిన మృతుడు రామవరపు రమణ (9) తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కకాటుతో గత నెల 8వ తేదీన స్థానిక సీహెచ్‌సీలో తల్లిదండ్రులు రమణను వైద్యానికి చేర్చారు. వైద్యులు వ్యాక్సిన్ వేసి ఆస్పత్రిలో ఉంచారు.అంతా నయమైపోయిందని 13వ తేదీన ఇంటికి వెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు కృష్ణవేణి, సంగమేశ్వర్రావులు కుమారుడిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంతలో తెల్లవారుజామున జ్వరం రావడంతో తల్లిదండ్రులు బాలుడు రమణను మళ్లీ సీహెచ్‌సీకి తరలించారు. దీంతో వైద్యులు పరీక్షించి ఇక్కడ నయం కాదని విజయనగరం జీజీహెచ్‌కు రిఫర్ చేశారు.అక్కడి డాక్టర్లు బాలుడి పరిస్థితి గమనించి కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని రిఫర్ చేశారు. కేజీహెచ్‌కు తరలిస్తుండగా బాలుడు మృత్యువాత పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదంతా స్థానిక సీహెచ్‌సీ డాక్టర్ల నిర్లక్ష్యం, రిఫర్ కారణంగా జరిగిందని వాపోతున్నారు. రోగులను పట్టించుకోవడం లేదని, అందరినీ వేరే ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని, మాలాంటి పేదోళ్లకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించే స్థోమత లేదని ప్రభుత్వాస్పత్రిలో వైద్యాన్ని నమ్ముకుంటే తమ పిల్లాడు బలైపోయాడని అల్లాడిపోయారు.
ఎమ్మెల్యేకు చెప్పి ఆవేదన:
గ్రామంలో మరో నలుగురికి కుక్క కరిస్తే వారు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోవడంతో బతికిబట్టకట్టారని, మాలాంటి పేదోళ్లం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లలేక కొడుకును బలిచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యం, చికిత్సను అందించక ప్రైవే టు ఆస్పత్రులకు వెళ్లాలని రిఫర్ చేస్తున్నారని బాలుడి తల్లిక్రి కృష్ణవేణి ఆస్పత్రి కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బేబినాయన ముందు వాపోయింది.
మావైద్యం మేం చేశాం
బాలుడి మృతిపై సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శశిభూషణరావు వివరణ కోరగా బాలుడికి అవసరమైన చికిత్సనంతా అందించామన్నారు. బాలుడి పరిస్థితి విషమించడంతోనే జీజీహెచ్, కేజీహెచ్‌లకు రిఫర్ చేశామని చెప్పారు.


