తీరప్రాంత భద్రత దేశ రక్షణకు కీలకం
భోగాపురం: దేశరక్షణలో తీరప్రాంత భద్రత అత్యంత కీలకమని ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు భోగాపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) అధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా సైకిల్ ర్యాలీని శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీరప్రాంత భద్రతపై ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కోస్టల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ (జాతీయ సమైక్యత) నేషనల్ ప్రైడ్ గురించి స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది రెండు బృందాలుగా విడిపోయి కోల్‌కతా, గుజరాత్‌ల నుంచి ప్రారంభించిన మెగా సైకిల్ ర్యాలీని కేరళ వరకు కొనసాగించనున్నట్లు చెప్పారు. సుమారు 100 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఒక టీమ్‌గా ఏర్పడి ఈ యాత్రను చేపట్టారన్నారు. ఈ క్రమంలో భోగాపురం చేరుకున్న ర్యాలీ బృందంతో కలిసి భాగస్వాములు కావడం, వారికి భద్రత ఏర్పాట్లను కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ కె.దుర్గాప్రసాద్, ఎస్సై వి.పాపారావు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్


