జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు
పూసపాటిరేగ: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను ఆహ్లాదకరంగా ఉంచాలని, అలాగే పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి చెప్పే సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలన్నారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా సీసీ కెమెరాలు అమర్చాలని, గస్తీ, జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వంటి చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ రికార్డులు, సీడీ ఫైల్స్, హిస్టరీ సీట్లు, నాన్‌బెయిలబుల్ వారెంట్లపై సమీక్షించారు. మహిళలు, బాలలు, సైబర్ నేరాలు, రహదారి భద్రత పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు. డయల్ యువర్ 100, 112 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే పూసపాటిరేగ మండలంలోని కొండగుడ్డిలో జరిగిన హత్య వివరాలను రూరల్ సీఐ రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఆ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాలను సేకరించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని తెలిపారు. ఆయన వెంట ఎస్‌బీ సీఐ ఎ.వి.లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.


