బ్యాంకర్లు ఆర్థిక వృద్ధికి తోడ్పడాలి
పార్వతీపురం: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో బ్యాంకర్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.సోమశేఖర్, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, డీటీఓ బి.ప్రసాదరావుతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి


