చదువుల తల్లి భువనేశ్వరికి అండగా నిలవలేమా?
సాక్షి, పార్వతీపురం మన్యం: పేద విద్యార్థుల విదేశీ విద్యకలను సాకారం చేసేలా రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం అమలవుతుందా అని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రశ్నించారు. తమ అందరికీ గర్వకారణంగా.. జిల్లాలోని కురుపాం మండలం సప్పగొత్తిలి గిరిజన గ్రామానికి చెందిన గేదెల భువనేశ్వరి వ్యవసాయ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసి, ఉన్నత విద్య చదవాలనే కోరికతో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (ఇంగ్లీషు ఎపిసన్స్) ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్, మాస్టర్ ఆఫ్ సైన్స్ లో ప్రవేశానికి అర్హత సాధించిందని చెప్పారు. ఆ కోర్సు పూర్తి చేయడానికి సుమారు రూ.70 లక్షల వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ నెల 23వ తేదీలోపు యూనివర్సిటీలో చేరాల్సి ఉందని తెలిపారు. లేకుంటే ఆమె కలలు మధ్యలోనే ఆగిపోతాయని ఆందోళన చెందారు. ఈ మేరకు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాశారు. తన ప్రతిభను ప్రభుత్వం గుర్తించి, ఈ ఆణిముత్యం, చదువుల సరస్వతికి అండగా నిలవాలని కోరారు.
సాయమన్నా చేయండి..
రుణమైనా
ఇవ్వండి...
ఆమె తండ్రి గేదెల సత్యభగవాన్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ చదువు కోసం ఆస్ట్రేలియా పంపించేంత స్థోమత లేదని రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు ఆర్థిక సహాయం కోసం ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. విద్యాశాఖ మంత్రి పేషీలో కూడా వినతిపత్రం అందజేసినట్లు తెలిసిందన్నారు. విద్యా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే.. వారు అనేక కొర్రీలు పెడుతున్నారని వివరించారు. ఏజెన్సీ/షెడ్యూల్డ్ ఏరియా భూములు తనఖా పెట్టి విదేశీ విద్యకు బ్యాంకు రుణం ఇవ్వలేమంటున్నాయని తెలిపారు. దళిత, గిరిజన, పేద విద్యార్థులకు అంబేడ్కర్ విదేశీ పథకం కింద విదేశాలలో చదువుకునేందుకు సహాయం చేస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం.. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన గేదెల భువనేశ్వరి మొర ఆలకించకపోవడం విచారకరమన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ విదేశీ విద్యా పథకం కింద గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. అర్హత సాధించిన పేద విద్యార్థులకు విదేశీ చదువులకు ఆర్థిక సహాయంతో పంపించేవారన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చదువుకునే కోర్సు, యూనివర్సిటీని బట్టి సుమారు కోటి రూపాయల వరకు ఆర్థిక సహాయం మంజూరు చేసేవారని గుర్తు చేశారు.
సహకరించాల్సిన బాధ్యత వారిదే..
తన నియోజకవర్గంలోని ఒక పేద మహిళా గిరిజన విద్యార్థి ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులకు అర్హత పొందినందుకు కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగదీశ్వరి.. జిల్లాకు చెందిన గిరిజన, ఒక మహిళా మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి గర్వపడాలని రాజన్నదొర అన్నారు. విషయం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, అండదండలు ఉండే విధంగా కృషి చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. వీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియడం లేదన్నారు. ఈ విషయమై మంచి మనసుతో ఆలోచించి పేద గిరిజన విద్యార్థికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ పీవో, కలెక్టర్ కూడా స్పందించి గిరిజన విద్యార్థి భువనేశ్వరికి, తమ పరిధిలో ఆర్థిక సహాయం చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, అమ్మాయి చదువుకు ఆటంకాలు తొలగించాలని కోరారు. లేకుంటే జిల్లా అధికారులు బ్యాంకులకు హామీ ఇచ్చి గిరిజన శ్రేయస్సు కోసం అండగా నిలవాలని సూచించారు. విదేశీ చదువుకు బ్యాంకులు రుణాలు సహజంగానే మంజూరు చేస్తాయని.. గిరిజన విద్యార్థి గేదెల భువనేశ్వరికి బ్యాంకు రుణం మంజూరులో నిబంధనలు అడ్డు వస్తున్నట్లు తెలుస్తోందన్నారు. వాస్తవాలు పరిగణనలోకి తీసుకొని, గిరిజన విద్యార్థినికి ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేయాలని, లేకుంటే.. రూ.70 లక్షల విద్యా రుణం అయినా వచ్చేలా చూడాలని గిరిజన సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు.
గిరిజన బిడ్డకు ఆస్ట్రేలియాలో చదివే అవకాశం
ప్రభుత్వ తోడ్పాటు, రుణం కోసం ఎదురుచూపు
రాష్ట్రంలో అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం అమలవుతుందా..?
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,
విప్ స్పందించాలి
ప్రభుత్వానికి లేఖ రాసిన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర


