గిరిజన యువకుడి అవయవాలు దానం
పాచిపెంట: బొలెరో వాహనం బోల్తాపడిన ఘటనలో బ్రెయిన్ డెడ్ అయిన గిరిజన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పాచిపెంట మండలం గరేళ్లవలస గ్రామానికి చెందిన మంచాల గణేష్ (22) ఈ నెల 4వ తేదీన శివలింగాపురం సమీపంలో బొలెరో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. అత్యవసర వైద్యం నిమిత్తం శ్రీకాకుళం జెమ్స్‌లో చేర్పించారు. అతని బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి వైద్యులు సూచన మేరకు గణేష్ అవయవాలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు వచ్చారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు, కాలేయం తదితర అవయవాలను పలు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు దానం చేశారు. అవయవ దానానికి అంగీకరించిన గణేష్ కుటుంబ సభ్యులను ఆస్పత్రి వైద్యులతో పాటు పలువురు అభినందించారు.
గిరిజన యువకుడి అవయవాలు దానం


