వైద్యసేవలందక రోగుల అవస్థలు
● నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మెకు 15 రోజులు
● పట్టించుకోని ప్రభుత్వం
విజయనగరంఫోర్ట్:
● గంట్యాడ మండలానికి చెందిన ఎస్.సూరమ్మ కంటి సమస్య ఉందని విజయనగరంలోని ఓ ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కంటి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశాం. ఆపరేషన్‌కు రూ.10 వేలు అవుతాయని చెప్పడంతో డబ్బులు పెట్టి చేయించుకోలేక ఆమె వెనుదిరిగింది.
● విజయనగరం పట్టణానికి చెందిన దేవికి కడుపు నొప్పి రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని చెప్పడంతో డబ్బులు చెల్లించి శస్త్రచికిత్స చేయించుకుంది.
ఇలా వీరిద్దరే కాదు. ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్‌వైద్య సేవ) సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు సేవలు అందించినందుకు గాను నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడంలో కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెట్‌వర్క్ ఆస్పత్రులకు కోట్లాది రుపాయిలు కూటమి సర్కార్ చెల్లించాల్సి ఉంది.
మొద్దునిద్రలో సర్కార్
అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నా కూటమి సర్కార్ పట్టించుకోకుండా మొద్దు నిద్ర నటిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచితంగా వైద్యసేవలు అందక రోగులు డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నా కూటమి సర్కార్ పట్టించుకోక పోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
మొదటి సారి రోడ్డెక్కిన నెట్‌వర్క్ ఆస్పత్రులు
తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర చరిత్రలో ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్యసేవ) నెట్‌వర్క్ ఆస్పత్రులు తొలిసారి రోడ్డెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు విజయవాడలో ధర్నా నిర్వహించాయి. అయినప్పటికీ కూటమి సర్కార్ సమ్మె విరమింపజేసే ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశ పెట్టిదాదాపు 18 ఏళ్లు అవుతోంది. ఇంతవరకూ ఎప్పుడూ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ధర్నా చేపట్టినా దాఖలాలు లేవు. కానీ కూటమి సర్కార్ హయాంలోనే నెట్‌వర్క్ ఆస్పత్రులు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది. పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరీ ఉచితంగా సేవలు అందించేవి. గుండె జబ్బులు, కేన్సర్ వంటి పెద్ద వ్యాధులకు కూడా ఉచితంగా వైద్యసేవలు అందించేవారు. కానీ కూటమి సర్కార్ హయాంలో రోజుల తరబడి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా పట్టించుకోక పోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.


