పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు అమ్మవారికి శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష పర్యవేక్షించారు.
వీఆర్‌ఎస్ కాలువలో పడి ఆవు మృతి
మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్ట్ లింక్‌చానల్‌లో ప్రమాదవసత్తు జారిపడి మంగళవారం ఓ పాడి ఆవు మృతిచెందింది. మండలంలోని శంబర గ్రామానికి చెందిన రైతు బలగ పోలినాయుడు ఆవును మేతకోసం, లింక్‌చానల్ వైపు తీసుకువెళ్లగా, ఆవుమేస్తుండగా కాలువలో జారిపడింది. మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో, ఆవు కాలువలో నుంచి ఒడ్డుకు చేరుకోలేక మృతిచెందింది. ఆవు విలువ సుమారు రూ.70వేలు ఉంటుందని, రైతు పోలినాయుడు ఆవేదనచెందాడు. కాలువలో ఆవుపడి మృతిచెందిందన్న విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి గణేష్, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతిచెందిన ఆవును జేసీబీ సహాయంతో ఒడ్డుకు చేర్చారు.
లారీ ఢీ కొని వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆంజనేయస్వామి ఆలయం వద్ద మంగళవారం లారీ ఢీ కొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనపై మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలకేంద్రంలోని మారుతి కాలనీకి చెందిన బండారు చిన్నారావు (67) మంగళవారం ఉదయం టీ తాగేందుకు బైపాస్ సెంటర్‌కు వెళ్తున్నాడు. సరిగ్గా ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి అదే సమయంలో విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తున్న లారీని బాడంగి రూట్‌లోకి తిప్పుతుండగా ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారావును ప్రథమ చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆప్పటికే మృతిచెందినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
పుష్పాలంకరణలో పైడితల్లి


