వైభవంగా సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం వెండి మంటపం వద్ద సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవాన్ని జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మంటపం వద్దకు తీసుకువెళ్లి అక్కడున్న ప్రత్యేక ఊయలలో ఆసీనులను చేశారు. అనంతరం సహస్ర దీపాలను వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్, రామగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.


