ఆగని ఇసుక అక్రమ రవాణా
● కూటమి ప్రభుత్వంలో రెచ్చిపోతున్న ఇసుక దొంగలు
● గత ప్రభుత్వంలోని ఇసుక డంపింగ్ యార్డు నుంచి చోరీ
బొబ్బిలి: మోంథా తుఫాన్ కారణంగా ఇసుక దొరకడం లేదు. దీంతో ఇసుకాసురులు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా గత ప్రభుత్వం ఇసుక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది. వర్షాకాలంలో సైతం గృహ నిర్మాణదారులు, ప్రభుత్వ అవసరాలకు తక్కువ ధరకే ఇసుకను అందజేసింది. కూటమిప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుకంటూ ఇసుకాసురులకు గేట్లెత్తేయడంతో డంపింగ్ యార్డుల్లో ఇసుకను ఎందుకు కొనాలంటూ అక్రమార్కులు రెచ్చిపోయారు. నదులు, వాగులు, గెడ్డల్లో ఉన్న ఇసుకను నిబంధనలను పక్కనెట్టి ఇసుక తరలించుకుని కాసులు వెనకేసుకున్నారు. గత నెలలో సాక్షాత్తు ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహన రావు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి జరిమానాలు కూడా విధించారు. గ్రోత్‌సెంటర్ ఇసుక డంపింగ్ యార్డులో వేల టన్నుల ఇసుక ఉంది. నిర్ణీత ధర చెల్లించి పట్టుకెళ్లమని పలుమార్లు అక్రమార్కులకు చెప్పినా వినిపించుకోకుండా వేగావతి నదిలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న అక్రమార్కులకు ఇప్పుడు మరో దారి దొరికినట్లుంది. మోంథా తుఫాన్ రావడంతో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇసుక కొరత ఏర్పడింది. బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో ఉన్న ఇసుక డంపింగ్ యార్డులో సిద్ధంగా ఉన్న వేలాది టన్నులకు పైగానే ఉన్న ఇసుకపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. అంతే ఆ ఇసుకకు ఇప్పుడు కాళ్లొచ్చాయి. ఎంచక్కా సిద్ధం చేసి ఉన్న ఇసుక ఇప్పుడు అక్రమార్కులకు వరమై నిర్ణీత ధర నిబంధనలను పక్కన పెట్టి రాత్రి వేళల్లో తరలించుకుపోతున్నారు. అక్కడున్న కార్యాలయంలో కాగితాలు, ఇతర వస్తువులను చిందర వందర చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్ ఎం.శ్రీను కార్యాలయంలోని ఆర్‌ఐ రామ్‌కుమార్‌ను పరిశీలించి రమ్మని పంపితే పొక్లెయినర్‌తో తరలిస్తున్నట్లు ఆయన గుర్తించారు. ఇదే విషయమై తహసీల్దార్‌కు ఆర్‌ఐ సమాచారమిచ్చారు. నదిలో జల ప్రవాహంతో ప్రజలకు, ప్రభుత్వ అవసరాలకు, వ్యాపారులకు సైతం అందని ఇసుక ఇప్పుడు అక్రమార్కులకు మాత్రం ఉచితంగా అందుతోంది. విచిత్రమేమంటే పేద, మధ్యతరగతి ప్రజల గృహావసరాలకు కాకుండా పట్టణంలో నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలకు, కార్పొరేట్ వాణిజ్య సముదాయాలకు మాత్రం ఇసుకను ఎంచక్కా తరలించుకుపోతున్నారు. మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డులను నాడు విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు వాటిని ఇలా కార్పొరేట్ నిర్మాణాలు, ఇసుక అక్రమార్కులకు దొంగచాటు అనుమతులు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తునాయి.
పోలీసులకు ఫిర్యాదు
ఇసుకను దొంగతనంగా పట్టుకుపోతున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహన రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయనను ఈ విషయమై అడుగ్గా ఎవరు ఇలా తరలించుకుపోతున్నారోనన్న విషయం గుర్తించాలని పోలీసులను కోరుతున్నట్లు చెప్పారు.
ఆగని ఇసుక అక్రమ రవాణా
ఆగని ఇసుక అక్రమ రవాణా


