తత్కాల్ ఫీజు రద్దు
● విద్యార్థులపై ఆర్థిక భారం తొలగింపు
● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు
విజయనగరం రూరల్: జేఎన్టీయూ గురజాడ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులు వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఇప్పటివరకు వసూలు చేస్తున్న తత్కాల్ ఫీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుందని జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వీవీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి తత్కాల్ రుసుము రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. నేటి సాంకేతిక యుగంలో విశ్వవిద్యాలయ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు చేరవేయడం తమ ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా పలు సాంకేతిక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ‘తత్కాల్ సేవ’ కింద ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు విద్యార్థులు ఇప్పటివరకు రూ.3000 అదనపు ఫీజు చెల్లించాల్సి వచ్చేదని. ఇకపై ఎటువంటి అదనపు రుసుము లేకుండా, విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు 24 గంటల్లో ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరించి, ఈ సేవలను అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సేవలను సమర్థవంతంగా అమలు చేయడానికి పరీక్షల మూల్యాంకన విభాగం ప్రత్యేక కృషి ప్రారంభించిందని, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.జయసుమ, మూల్యాంకన విభాగ సంచాలకులు కె.బాబులు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఆర్.గురునాథ, విశ్వవిద్యాలయ సాంకేతిక కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఆర్.రాజేశ్వరరావు, అడిషనల్ కంట్రోలర్ డా.బి.నళిని, డా.నీలిమా దేవి, ఆర్‌డీడీ శివరాం, డా.ఎ.పాపారావు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఇకనుంచి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, అధిక సౌలభ్యంతో విశ్వవిద్యాలయ ధ్రువీకరణ పత్రాల సేవలను పొందగలరని పేర్కొన్నారు.


