డ్రగ్స్ భూతాన్ని దరిచేరనివ్వం
● పోలీస్ సిబ్బంది ప్రతిజ్ఞ
● ఎస్పీ ఆధ్వర్యంలో ఏక్తా దివస్
● బ్యారెక్స్‌లో సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ 150వ జయంతి
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను మనమందరం కలిసికట్టుగా నిర్మూలిద్దామని ఎస్పీ దామోదర్ అన్నారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా విజయనగరంలోని కంటోన్మెంట్ పోలీస్‌బ్యారెక్స్‌లో ఏక్తా భారత్, నషా ముక్త్ భారత్ పేరుతో కార్యక్రమం శుక్రవారం జరిగింది. దాదాపు పదిహేను కాలేజీల స్టూడెంట్స్‌తో పోలీస్ బ్యారెక్స్‌లో ఎస్పీ దామోదర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామాదర్ మాట్లాడుతూ గంజాయి అక్రమ నిరోధానికి కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు మనమందరం కంకణం కట్టుకోవాలని కోరారు.
ఉక్కుమనిషి పటేల్
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులనే గడగడ లాడించిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ దేశ తొలి హోంమంత్రి గా బాధ్యతలు నిర్వర్తించారన్న విషయం ఈ తరం వారికి అంతగా తెలియదన్నారు. ఉక్కు మనిషి అని తెల్లదొరలే పటేల్‌కు పేరు పెట్టారంటే వల్లభ భాయ్ పటేల్ ధైర్యం, శౌర్య పరాక్రమాలు ఏ పాటివో మనందరం తెలుసు కోవాలన్నారు. కూటమి ఎమ్మెల్యే ఆదితి గజపతి మాట్లాడుతూ సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అందరికీ ఆదర్శ ప్రాయుడన్నారు. ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఇచ్చే స్ఫూర్తితో ఏక్తా ర్యాలీని నిర్వహించుకున్నామన్నారు. కార్యక్రమానికి ముందు బ్యారెక్స్‌లో యూనిటీ మార్చ్ సెల్ఫీ పాయింట్‌లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ ఫొటోలు దిగారు. పోలీస్ శిక్షణ కళాశాల ప్రాంగణంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి మనంగా నివాళులు అర్పించారు. అనంతరం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి, సమైక్యతా ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ రామచంద్రరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఈ.కోటిరెడ్డి, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, మై భారత్ జిల్లా యువజన సమన్వయ కర్త ప్రేమ్ భరత్ కుమార్, రెడ్ క్రాస్ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పెద్ద సంఖ్యలో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


