కొత్త రైతు బజార్ల సంగతేంటి..?
● జిల్లాకు రెండేళ్ల క్రితం నాలుగు రైతు బజార్ల మంజూరు
● ప్రారంభానికి నోచుకోని రైతుబజార్లు
● పట్టించుకోని కూటమి పాలకులు
విజయనగరం ఫోర్ట్: రైతు సంక్షేమానికిపాటు పడుతున్నామని, వారి సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని కూటమి నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అవి ప్రకటనలకే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కూటమి సర్కార్ పాలనలో రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూరియా దొరక్క అధికధరకు కొనుగోలు చేశారు. రైతుబజార్ల ఏర్పాటు విషయంలోనూ కూటమి సర్కార్ అలసత్వం వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఆరు రైతు బజార్లు
విజయనగరంలో ఆర్‌అండ్‌బీ జంక్షన్, దాసన్నపేట, కొటారుబిల్లి, ఎస్.కోట, రాజాం, చీపురుపల్లిలలో రైతు బజార్‌లు ఉన్నాయి.
కొత్తగా నాలుగు మంజూరు
రెండేళ్ల క్రితం జిల్లాకు కొత్తగా నాలుగు రైతు బజార్లు మంజూరయ్యాయి. జిల్లాలోని భోగాపురం, కొత్తవలస, బొబ్బిలి, చీపురుపల్లి నియోజకవర్గంలో మరో రైతు బజారు ఏర్పాటుకు మంజూరు కాగా వాటిలో ఏఒక్కటి కూడా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. భోగాపురంలో ఇటీవల శంకుస్థాపన చేసారు. బొబ్బిలి, కొత్తవలసలలో శంకుస్థాపన కూడా ఇంతవరకు చేయలేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో పునాదిస్థాయిలో నిలిపివేశారు.
రైతు బజార్లతో రైతులకు మేలు
రైతు బజార్లు ఏర్పాటైతే రైతులకు మేలు జరుగుతుంది. రైతు బజార్లు ఏర్పాటు కావడం వల్ల రైతులు తాము పండించిన కూరగాయలను, ఆకుకూరలను నేరుగా రైతుబజార్‌కు తెచ్చి విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల పంటకు గిట్టుబాటు ధర కూడా ఉంటుంది. దళారుల బెడద ఉండదు. రైతు బజార్లు లేక పోవడం వల్ల రైతులు బహిరంగ మార్కెట్‌లో కూరగాయలను, ఆకు కూరలను విక్రయించుకోవాల్సిన పరిస్థితి. మార్కెట్‌లో దళారులు అడిగిన రేటుకు పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి. దీనివల్ల రైతులు పంటకు గిట్టుబాటు కాక నష్ట పోవాల్సిన పరిస్థితి. బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలంలో రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తారు. ఈ నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటైతే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుబజార్ లేక పోవడం వల్ల రైతులు మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారు. దీనివల్ల గిట్టుబాటు ధర పొందలేక పోతున్నారు. కొత్తవలస మండలంలో కూడా కూరగాయల సాగును ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ కూడా రైతుబజార్ లేక పోవడం వల్ల రైతులు మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటున్నారు. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో కూడా రైతులు కూరగాయలు ఎక్కువగా సాగుచేస్తారు. ఇక్కడ కూడా రైతుబజార్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
భోగాపురంలో శంకుస్థాపన పూర్తి
భోగాపురంలో కొద్ది రోజుల క్రితం రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గంలో రైతు బజార్ నిర్మాణం పునాది స్థాయిలో నిలిచిపోయింది.కొత్తవలస, బొబ్బిలిలో స్థల సమస్య కారణంగా నిర్మాణం ఇంకా చేపట్టలేదు.
బి. రవికిరణ్, ఎ.డి, మార్కెటింగ్‌శాఖ


