అత్యవసరం అటకెక్కింది..!
అందుబాటులో లేక.. ఆగిన ఊపిరి!
పార్వతీపురం రూరల్: ఆపదలో అండగా.. అత్యవసరానికి ఆసరాగా నిలవాల్సిన 108 సేవలు జిల్లాలో గాడి తప్పుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు వంటి ప్రాణాపాయ స్థితుల్లో ఉన్న వారిని క్షణాల్లో ఆసుపత్రులకు తరలించాల్సిన ఈ ప్రాణదాత వాహనాలు.. ఇప్పుడు రిఫరల్ బండ్ల మాదిరిగా మారిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న అంబులెన్సులను కాదని, జ్వరం, కాళ్ల నొప్పులు, రక్తలేమి వంటి సాధారణ కేసులను సైతం పెద్దాసుపత్రులకు తరలించేందుకు 108 వాహనాలనే విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో అసలైన అత్యవసర సమయాల్లో బాధితులకు సేవలు అందక, అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాల్లా కొడిగడుతున్నాయి. ఇటీవల కురుపాం మండలంలో జరిగిన ఘటనే ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
సేవలో 30శాతం.. దారి మళ్లినట్లే!
జిల్లా గణాంకాలే ఈ నిర్లక్ష్యపు తీరును స్పష్టం చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 108 వాహనాలు 15 అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రతి రోజూ సగటున 70 మందికి సేవలు అందిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ మొత్తం సేవల్లో ఏకంగా 30 శాతం కేవలం రిఫరల్ కేసులకే వినియోగిస్తుండటం. వాస్తవానికి జిల్లాలో 49 ప్రభుత్వ ఆసుపత్రులు ఉండగా, వాటి అవసరాల నిమిత్తం 16 ప్రత్యేక అంబులెన్సులు (చిన్నారుల కోసం మరో 2 నియోనాటల్ వాహనాలు) అందుబాటులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం.. వాంతులు, విరేచనాలు, జ్వరాలు, రక్తలేమి వంటి సాధారణ కేసులను పెద్దాసుపత్రికి తరలించాల్సిన బాధ్యత ఆసుపత్రి అంబులెన్సులదే. కానీ, సిబ్బంది నిర్లక్ష్యమో, అధికారుల పర్యవేక్షణ లోపమో తెలియదు గానీ.. ఆసుపత్రి అంబులెన్సులను పక్కనపెట్టి, లేక అవి అందుబాటులో లేకో అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన 108లకే ఫోన్ కొడుతున్నారు. దీంతో అసలైన బాధితులకు అంబులెన్స్ అందుబాటులో లేదనే సమాధానమే దిక్కవుతోంది.
ఆరు గంటల ప్రయాణం.. ఆగిపోయిన సేవ!
జిల్లా కేంద్రమైన పార్వతీపురం నుంచి ఏదైనా రిఫరల్ కేసును విజయనగరం తరలించి, తిరిగి రావాలంటే 108 వాహనానికి కనీసం ఆరు గంటల సమయం పడుతోంది. ఈ ఆరు గంటల పాటు ఆ వాహనం పరిధిలోని మండలాల్లో ఎలాంటి పెను ప్రమాదం జరిగినా సకాలంలో స్పందించే నాథుడే కరువవుతున్నాడు. ఈ లోపు ఎక్కడైనా ప్రమాదం జరిగితే అంతే సంగతులు. కేవలం జిల్లా ఆసుపత్రిలో మినహా, మిగిలిన ప్రాంతీయ ఆసుపత్రుల్లో 108ల వినియోగం అత్యంత దారుణంగా తయారైందని స్వయంగా సిబ్బందే వాపోతున్నారు. అత్యవసర సేవలకు కేటాయించిన వాహనాలను ఇలా రిఫరల్ కేసులకు వాడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఆసుపత్రి అంబులెన్సులనే రిఫరల్ కోసం వాడేలా కఠిన ఆదేశాలు జారీ చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కేసులు అత్యవసరమైతేనే రోగుల మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రులకు రిఫర్ చేయాలని మేము సూచించాం. రోగుల పరిస్థితిని బట్టి, అవసరానికి అనుగుణంగానే ఆసుపత్రి అంబులెన్సులు, 108 వాహనాలను వినియోగిస్తున్నాం. ఒక ప్రాంతంలోని 108 వాహనం రిఫరల్ కోసం బయటకు వెళ్లినప్పుడు, దాని స్థానంలో పక్కనున్న మండలాల నుంచి మరో 108 వాహనం సేవలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు ఒకింత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. 108 వాహనాలు ఎల్లప్పుడూ అత్యవసర సేవలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ ఎస్.భాస్కరరావు,
డీఎంహెచ్‌వో
108 ఎటు పోతుందో...!
‘ప్రాణ’ సేవకు రిఫరల్ గండం
మొత్తం సేవల్లో 30 శాతం దారి మళ్లినవే...
సకాలంలో అందని సేవలు
జిల్లాలో 49 ఆసుపత్రులు, 16 అంబులెన్సులు
108 వాహనాలు 15
కురుపాం మండలం పూతికవలసకు చెందిన జి.గౌరునాయుడు ఇటీవల ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న అతడిని చూసి చలించిన స్థానికులు తక్షణం 108కు సమాచారం ఇచ్చారు. కానీ, అక్కడే విధి వక్రీకరించింది. స్థానికంగా ఉండాల్సిన కురుపాం, భద్రగిరి వాహనాలు.. గత వైఎస్సార్‌సీపీ హయాంలో కేటాయించిన వాహనాలను, ప్రస్తుత ప్రభుత్వ రంగులు దిద్దుకునేందుకు వెళ్లాయని తెలిసింది. అదే సమయంలో గరుగుబిల్లి, చినమేరంగిలోని వాహనాలు విజయనగరం, పార్వతీపురానికి ‘రిఫరల్’ విధుల్లో ఉన్నాయి. జియ్యమ్మవలస అంబులెన్స్‌ను భద్రగిరికి పంపించారు. అత్యవసర సేవలన్నీ ఇలా పక్కదారి పట్టడంతో చివరకు మారుమూల వీరఘట్టం నుంచి వాహనం రావాల్సి వచ్చింది. అది వచ్చేసరికే జరగరాని ఘోరం జరిగిపోయింది. విలువైన సమయం (గోల్డెన్ అవర్) వృథా కావడంతో, సకాలంలో వైద్యం అందక గౌరునాయుడు మార్గమధ్యంలోనే కన్ను మూశాడు. 108 సకాలంలో స్పందించి ఉంటే ఆ నిండు ప్రాణం నిలిచేదేమోనని స్థానికులు, బంధువుల వాపోతున్నారు. ఈ ఒక్క ఘటనే కాదు, జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే దుస్థితి పునరావృతమవుతోంది.


