అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: మోంథా తుఫాన్ కారణంగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్ది ఆదేశించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అక్టోబరు 27 నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు, నదీ పరీవాహక ప్రాంత ప్రజలను దండోరా, మైకు ప్రచారం ద్వారా తెలియజేయాలని సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే చోట స్నానాలు, ఇసుక తవ్వకాలు వంటివి చేయరాదని, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంట కాలువలు తెగిపోకుండా ఇసుక బస్తాలు సిద్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు. వాగులు, వంకలు, నదులు దాటవద్దని తెలిపారు. శిథిలావస్థ భవనాలు, పాఠశాలల్లో ఎవరూ లేకుండా చూడాలని, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రమాదకర విద్యుత్ స్తంభాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు.


