పార్వతీపురం: మోంథా తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి ఈ నెల 29 వరకు మూడు రోజులు సెలవు దినాలుగా ప్రకటించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న నేపథ్యంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలకు సోమవారం నుంచి బుధవారం వరకు సెలవులు ప్రకటించామన్నారు. ఈ సెలవులు జిల్లాలో గల అన్ని యాజమాన్య పాఠశాలలకు వర్తిస్తాయన్నారు. డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు మండల పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకొని 24 గంటలు అందుబాటులో వుండి, తుఫాన్‌పై అప్రమత చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.
వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ వాయిదా
● వచ్చే నెల 4న కార్యక్రమం
సాలూరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 28న తలపెట్టిన నిరసన ర్యాలీని వచ్చే నెల 4కు వాయిదా వేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఓ ప్రకటనలో తెలిపారు. మోంఽథా తుఫాన్ నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు తదితరులు గమనించాలని కోరారు.
నేటి పీజీఆర్‌ఎస్ రద్దు
పార్వతీపురం రూరల్: జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సోమవారం జరగనున్న పీజీఆర్‌ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక )ను రద్దు చేసినట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్ వివరించారు. కావున దీన్ని ప్రజలు గమనించి సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలపై వినతులు అందజేయడానికి రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సీతంపేటలో
సీతంపేట: జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేస్తున్నట్టు పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన ప్రజానీకం విషయం గమనించాలని కోరారు.
నిలకడగా నాగావళి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: నాగావళి నది నీటి ప్రవాహం తోటపల్లి ప్రాజెక్టు వద్ద నిలకడగా ఉంది. ఆదివారం సాయంత్రానికి నది పైభాగం నుంచి 3,521 క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగా ఈ మేరకు అధికారులు 5,500 క్యూసెక్కల నీటిని నదిలోకి విడిచిపెట్టారు. అలాగే కాలువల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. మోంథా తుఫాను కారణంగా ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. ఒడిశాలో వర్షాలు కురిస్తే తోటపల్లి ప్రాజెక్టుకు వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
విజయనగరం అర్బన్: జిల్లాలోని విద్యా శిక్షణా సంస్థల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్, మున్సిపాల్ పాఠశాలల్లో పని చేస్తున్న అర్హత గల స్కూల్ అసిస్టెంట్‌లను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా త్రీమెన్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ మేరకు ఎంపిక ప్రక్రియ షెడ్యూల్‌ను డీఈవో యూ.మాణిక్యంనాయు డు విడుదల చేశారు. ఇప్పటికే ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇంతవరకు గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఇకపై లీప్ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో గూగుల్ ఫారం ద్వారా అప్‌లోడ్ చేసిన వారు కూడా మళ్లీ లీవ్ యాప్ ద్వారా సబ్మిట్ చేయాలి. ఆ యాప్‌లోని లింక్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత అధికారిచే కౌంటర్ సైన్ చేయించి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు.


