వినియోగదారులకు మేలు | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు మేలు

Aug 4 2025 3:51 AM | Updated on Aug 4 2025 3:51 AM

వినియ

వినియోగదారులకు మేలు

సౌర విద్యుత్‌తో

సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం సూర్యఘర్‌పై విస్తృత ప్రచారం చేయడంతో పాటు.. అందరూ వినియోగించుకునేలా చైతన్యం చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్‌ పార్వతీపురం సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీరు కె.మల్లికార్జునరావు తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులకు బిల్లుల ఆదాతోపాటు, అంతరాయాలు లేకుండా సరఫరా పొందవచ్చని.. మిగులును విక్రయించుకోవచ్చని చెప్పారు. స్మార్ట్‌ మీటర్లతో బిల్లుల భారం పడుతుందన్నది కేవలం అపోహేనని ఆయన తెలిపారు. ఇటీవల వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు విద్యుత్తు మీటర్లు, ఆధార్‌ లింకులో తప్పిదాల వల్ల అర్హత కోల్పోతున్నారని, తమ దృష్టికి వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఆధార్‌ అనుసంధానంలో తప్పిదాలు ఉంటే.. సంబంధిత సెక్షన్‌ కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదించవచ్చని సూచించారు. ‘సాక్షి’తో ముఖాముఖిలో సర్కిల్‌ పరిధిలో శాఖాపరంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

పీఎం సూర్యఘర్‌కు రాయితీ అందిస్తున్నాం..

పీఎం సూర్యఘర్‌ సోలార్‌ యూనిట్‌ రూ.2 లక్షల స్కీం. ఇందులో రూ.78 వేలు రాయితీ ఉంటుంది. మిగతా మొత్తం బ్యాంకులు రుణాల రూపంలో అందిస్తాయి. ఈఎంఐ విధానంలో చెల్లించుకోవచ్చు. 3 కిలోవాట్స్‌ వరకు లోడు పెట్టుకోవచ్చు. సోలార్‌ ప్యానెల్స్‌, బ్యాటరీ, ఇన్వర్టర్స్‌ అందిస్తాం. 25 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది. అధిక బిల్లు భారం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉత్పత్తిలో వినియోగం పోను తిరిగి విక్రయించుకోవచ్చు. యూనిట్‌కు రూ.2.65 పైసలు చొప్పున మేమే కొనుగోలు చేస్తాం. నెట్‌ మీటరింగ్‌ పెడతాం. ఈ ఏడాదిలో సర్కిల్‌కు 6 వేల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 422 ఇళ్లకు బిగించాం. 14 గ్రౌండింగ్‌ దశలో ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీల గృహాలను లీజుకు తీసుకుంటాం...

పీఎం సూర్యఘర్‌ కింద సౌర విద్యుత్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు తిరిగి డబ్బులివ్వనున్నాం. రూఫ్‌ టాప్‌ 200 ఎస్‌ఎఫ్‌టీ ఉండాలి. అటువంటి ఇళ్లను లీజుకు తీసుకుంటాం. మొత్తం ప్యానెళ్లన్నీ మేమే ఇస్తాం. వారికి అద్దె చొప్పున ఎస్‌ఎఫ్‌టీకి రూపాయి చొప్పున నెలకు రూ.200 తిరిగి ఇస్తాం. వారు వినియోగించే విద్యుత్‌ కూడా ఉచితమే. దీనిపై సర్వే చేసి, ఆసక్తి ఉన్న వినియోగదారులను గుర్తిస్తున్నాం.

ప్రతిపాదనలో కొత్త సబ్‌స్టేషన్లు

అడ్డాపుశీలలోని టిడ్కో గృహాల వద్ద 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం తుది దశలో ఉంది. కురుపాంలో 132/33 కేవీ సబ్‌ స్టేషన్‌ కోసం స్థలం సిద్ధంగా ఉంది. అక్కడ నిర్మాణం చేపడతాం. మరికొన్ని చోట్ల ప్రతిపాదనల దశలో ఉన్నాయి.

ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంతో వివిధ పనులు

ఆర్‌డీఎస్‌ఎస్‌ స్కీం ద్వారా జిల్లాలో వివిధ పనులు చేపడుతున్నాం. ఇందులో ప్రధానంగా ప్రత్యామ్నాయ లైన్లు, సబ్‌ స్టేషన్లలో విద్యుత్‌ అంతరాయాలు తగ్గించేలా అదనపు ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ఫీడర్లు, వ్యవసాయ ఫీడర్లు వేరుచేసే పనులు అవుతున్నాయి. సర్కిల్‌లో 59 ఫీడర్ల పనులు చేస్తున్నాం. పట్టణంలో ఎనిమిది ఫీడర్లు వేస్తున్నాం. మూడు సర్కిళ్లలో మొత్తం రూ.4 వేల కోట్లతో వివిధ పనులు జరుగుతున్నాయి. అడ్డాపుశీల టిడ్కో వద్ద సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో పాటు.. గరుగుబిల్లి నుంచి బూర్జ వరకు 12 కిలోమీటర్ల మేర 33 కేవీ ఇంటర్‌ లింకింగు లైన్లు వేశాం. దీనివల్ల విద్యుత్తు అంతరాయం తగ్గుతుంది. దీంతో పాటు జిల్లాకు కొత్త సర్కిల్‌ కార్యాలయం భవనం మంజూరైంది. సుమారు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నాం. ఏడాదిలో పూర్తవుతుంది.

ఆన్‌లైన్‌లోనే వ్యవసాయ కనెక్షన్ల రిజిస్ట్రేషన్‌

ప్రస్తుతం జిల్లాలో 22,277 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 908 మంది కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందులో 156 మంది నగదు కట్టలేదు. 696 మందికి కనెక్షన్ల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు నిరంతర ప్రక్రియ. రైతులు నేరుగా 1912 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

విద్యుత్తు కోతలు లేవు..

ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు కోతలు ఎక్కడా లేవు. ప్రతి శుక్రవారం నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నాం. ఆ సమయంలో సంబంధిత ఏరియాలో కొద్డి గంటలు సరఫరా ఆపివేస్తున్నాం. ఆ విషయం ముందుగానే వినియోగదారులకు మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం చేరవేస్తున్నాం.

స్మార్ట్‌ మీటర్లపై సందేహాల నివృత్తి

ప్రీపెయిడ్‌ తరహాలోనే విద్యుత్‌ బిల్లులు చెల్లించేలా స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటి వల్ల అధికంగా బిల్లులు వస్తాయన్నది అపోహే. ప్రస్తుతానికి కేటగిరీ–2(వాణిజ్య), ప్రభుత్వ కార్యాలయాలకు ఈ తరహా మీటర్లు అమర్చుతున్నాం. అధిక వినియోగం ఉన్న గృహాలకూ పెడుతున్నాం. ప్రస్తుతం జిల్లాలో 13,259 సర్వీసులకు మీటర్లు అమర్చాం. బిల్లు సెల్‌ఫోన్‌కే వస్తుంది. వినియోగదారులకు ఉండే సందేహాలను మా సిబ్బంది నివృత్తి చేస్తున్నారు.

పీఎం సూర్యఘర్‌ను ప్రతి ఇంటికీ చేరువ చేస్తాం..

ఎస్సీ, ఎస్టీలు సోలార్లు ఏర్పాటు చేసుకుంటే తిరిగి డబ్బులిస్తాం

స్మార్ట్‌ మీటర్లతో బిల్లుల భారం అపోహే

‘సాక్షి’తో ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ మల్లికార్జునరావు

వినియోగదారులకు మేలు 1
1/2

వినియోగదారులకు మేలు

వినియోగదారులకు మేలు 2
2/2

వినియోగదారులకు మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement