
మంత్రి సంధ్యారాణికి ఎందుకంత ఉలికిపాటు!
మెంటాడ: కూటమి నేతలు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రజా క్షేత్రంలో ప్రశ్నిస్తే మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఎందుకంత ఉలికిపాటు అని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిని చొక్కా పట్టుకొని అడగండి అని మంత్రి సంధ్యారాణి చెబుతున్నారని ఇచ్చిన హామీలపై అడిగితే అంత కోపమెందుకని ప్రశ్నించారు. ఎన్నికల వేళ నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో సూపర్ సిక్స్ అమలు చేయకుంటే చొక్కా పట్టుకుని అడగండి అని చెప్పారని ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ 50 సంవత్సరాలు దాటిని వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమయ్యాయని ప్రశ్నించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అర్హులందరికీ నగదు జమ కాలేదని దీనికి ఏం సమాధానం చెబుతారని అన్నారు. వీటిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు, జేసీఎస్ కన్వీనర్ కనిమెరక త్రినాధరెడ్డి, రాజప్పలనాయుడు, బాయి అప్పారావు, లెంక రత్నాకర్ ఉన్నారు.
మీరిచ్చిన హామీలనే మేము గుర్తు చేస్తున్నాం..
మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర