
విజృంభిస్తున్న విష జ్వరాలు
చీపురుపల్లి: పట్టణంతో పాటు పల్లెల్లో కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ గ్రామంలోనూ ప్రజలు జ్వరాలతో మంచాన పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు బారిన పడుతు న్న వారు సమీపంలోని ఆర్‌ఎంపీల ద్వారా స్వంత డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు. మండలంలోని విశ్వనాథపురంలో ఐదేళ్ల బాలిక జ్వరంతో మృత్యువాత పడడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు కాని, జ్వరాలు వచ్చిన తరువాత పంపిణీ చేయాల్సిన మందులు విషయంలో సైతం ఎక్కడా వారు కనిపించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అకస్మాత్తుగా...
మండలంలోని అలజంగి పంచాయతీ మధురా గ్రామమైన విశ్వనాథపురం గ్రామానికి చెందిన దన్నాన జాస్మిన్(5) అనే బాలిక వింత జ్వరంతో ఆదివారం మృతి చెందింది. రామప్పడు, నాగమణి దంపతులకు చెందిన జాస్మిన్ గత మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతోంది. స్థానికంగా ఆర్‌ఎంపీలు వద్ద వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యంలో మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
● విశ్వనాథపురంలో ఐదేళ్ల చిన్నారి మృతి
● పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ