
వీఆర్‌ఎస్ నీరు విడుదల
మక్కువ: వెంగళరాయసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని ఆదివారం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ వీఆర్‌ఎస్ ప్రాజెక్టు ద్వారా మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాలకు చెందిన 24,700ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. వీఆర్‌ఎస్ ప్రాజెక్టు నీటిమట్టం 1610 మీటర్లు కాగా, ప్రస్తుతం శతశాతం నీరు నిల్వ ఉందన్నారు. రైతులు సక్రమంగా నీటిని వినియోగించుకుంటే, శివారు గ్రామాల పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందన్నారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు రూ.263.27లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు పూర్తయితే ప్రాజెక్టు పరిధిలో 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.