ఆస్తిపై హక్కును రద్దు ఎలా చేస్తారు | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపై హక్కును రద్దు ఎలా చేస్తారు

Aug 2 2025 6:42 AM | Updated on Aug 2 2025 6:44 AM

పాలకొండ రూరల్‌: రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పొందుపర్చిన వెసులుబాటులను ఆసరాగా చేసుకుని తనకు దఖలుపడిన ఆస్తిపై ఉన్న హక్కును తన ప్రమేయం లేకుండా ఎలా రద్దు చేస్తారని ఓ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఎటువంటి నిబంధనలు ఉండవా? అడ్డగోలుగా వ్యవహరిస్తారా? అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించడంతో పాటు తనకు అన్యాయం చేయవద్దంటూ కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..అనకాపల్లి జిల్లా, అదే మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కట్టుమూరి సుమతి, అప్పారావు దంపతులు శుక్రవారం పాలకొండ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా రిజిస్ట్రార్‌ శ్రీరామ్మూర్తిని కలిసి తమ ఆవేదన వెళ్లగక్కారు. ఈ సందర్భంగా బాధితురాలు సుమతి మాట్లాడుతూ తన తల్లి ఓదిరి జయమేరి పసుపు కుంకుమ నిమిత్తం విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సర్వే నంబర్‌ 63/3 (డాబాగార్డెన్స్‌–కప్పరాడ గ్రామం) వద్ద డోర్‌ నంబర్‌ 57–28–16/7 అసెస్మెంట్‌ నంబర్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న రెసిడెన్షియల్‌ ఫ్లాట్‌ను గిఫ్ట్‌ రూపంలో అందించారన్నారు. ఇందుకు సంబంధించి 2021లో ద్వారకానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్తావేజు నంబర్‌ 2757/2021 రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వివరించారు. ఇటీవల తన ప్రమేయం లేకుండా సదరు గిఫ్ట్‌ దస్తావేజును పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2025 జూన్‌ 25వ తేదీన ‘ఎనీవేర్‌’ పద్ధతిలో వేరొకరు రద్దు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. తన సోదరుడు ఓదిరి సతీష్‌, ఆయన భార్య విజేత ఈ చర్యలకు పాల్పడినట్లు వాపోయారు.

నోటీసులు ఇవ్వకుండా చేశారు

రిజిస్ట్రేషన్‌ సమయంలో పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు తనకు ఎటువంటి నోటీసులు, సమచారం ఇవ్వకుండా తన ఆస్తిపై హక్కును రద్దు రిజిస్ట్రేషన్‌ చేయించడం అన్యాయమని వాపోయారు.

రిజిస్ట్రేషన్‌ విధానంలో గల ఎనీవేర్‌ పద్ధతిని అడ్డుపెట్టుకుని అధికారం, పలుకుబడి, నగదు చెల్లించి నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు ఈ వ్యవహరంపై లోతైన దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని బాధిత దంపతులు సుమతి, అప్పారావు కోరారు. ఫిర్యాదును పరిశీలించిన పాలకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ తన హయాంలో ఈ దస్తావేజు రద్దు జరగలేదన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు రద్దు చేయాలంటే కచ్చితంగా సంబంఽధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. వారి సమక్షంలో రద్దు దస్తావేజీలు రూపొందించాల్సి ఉంటుంది. బాధితులు అందించిన ఫిర్యాదును ఉన్నతాఽధికారులకు అందిస్తామని చెప్పారు.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద కన్నీరుపెట్టుకున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement