
నేటి నుంచి ప్రారంభం కానున్న శ్రావణ మాసం
నెలరోజుల పాటు పెళ్లిళ్లు, నోములు, వ్రతాలతో సందడే సందడి
పుంజుకోనున్న అనుబంధ వ్యాపారాలు
విజయనగరం: శ్రావణ మాసం శుక్రవారం ఆరంభం కానుంది. మంచిరోజులు రావడంతో పల్లెలు, పట్టణాల్లో పెళ్లి బాజాలు మోగడంతో పాటు ఇతర శుభకార్యాలు జోరందుకోనున్నాయి. మే 24 నుంచి మంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు చేసుకునే వారు ఇప్పటివరకు నిరీక్షించారు. ఈ నెల 24తో ఆషాఢం ముగిసింది. 25 నుంచి శ్రావణం ప్రారంభం కానుండడంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26, 30, 31, ఆగస్టు 1, 3, 4, 6, 10, 13, 15, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ మేరకు కల్యాణ మండపాలు, ఆలయాల ప్రాంగణాలను ముస్తాబు చేస్తున్నారు.
అమ్మవారి వ్రతాలకు శుభసమయం
పెళ్లిళ్లతో పాటు ఇళ్లలో నోములు, మంగళగౌరి, వరలక్ష్మి వ్రతాలకు శ్రావణమాసం శుభసమయం. ఇదే నెలలో అమ్మవార్లకు ఒడి బియ్యం సమర్పిస్తారు. మహిళలు అత్యంత భక్తితో అమ్మవారిని ఆరాధించే పూజల మాసమని దీనికి ప్రసిద్ధి. ఇంటినే దేవాలయంగా భావించి మామిడికొమ్మలతో అలంకరిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి వ్రతాలు ఆచరిస్తారు. చీరలు, నగలతో సుందరంగా అలంకరిస్తారు. అమ్మవార్లకు పసుపుకుంకుమలు సమర్పిస్తారు. వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉపవాసం చేస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
వారికి మంచి కాలం ఇది...
శ్రావణమాసం పలు వర్గాలకు సిరులు కురిపిస్తుంది. పెళ్లిళ్లకు అవసరమైన ఫంక్షన్ హాళ్లు, టెంట్లు, సౌండ్ సిస్టం, బ్యాండ్ పార్టీలు, పెళ్లిపందిళ్ల అలంకరణ వంటి వ్యాపారాలకు డిమాండ్ పెరుగనుంది. పత్రికలు, క్యాటరింగ్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు డబ్బులు వచ్చేకాలం ఇది.
ఆగస్టు 23 వరకు మంచి ముహూర్తాలు
ఈ నెల 25 నుంచి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం శుభకార్యాలు చేసుకునేందుకు యోగ్యమైనది. పెళ్లిళ్లు, కేశఖండనం, గృహ ప్రవేశాలు వంటివి జరుపుకోవచ్చు. ఈ మాసం శుభకరమైనది.
– కామేశ్వరశర్మ, వేదపండితుడు