
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: అల్పపీడన ద్రోణితో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి, నాగావళి నదులలో నీటిమట్టం తగినంత స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ నెల 24, 25 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నీటిమట్టం మరింత పెరగనుందని తెలిపారు. ఈ క్రమంలో లోతట్టు, నదీ పరీవాహక ప్రాంతాల్లో దండోరా వేయించడం, మైక్ ద్వారా ప్రచారం చేస్తూ ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ప్రజలను నిరంతరం వరదల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని సూచించారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా చూడాలన్నారు. ఒడిశా లో భారీ వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో వర్షాలు కురవకపోయినప్పటికీ, నదుల్లో నీటిమట్టం పెరిగి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌లో 08963 293046 నంబరు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే పార్వతీపురం, పాలకొండ రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండలాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్లు, వీఆర్‌వోలు, సిబ్బంది ప్రధాన కేంద్రాలను విడిచి వెళ్లరాదని, శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఎవరూ ఉండరాదని, అవసరమైన మేరకు పునరావాస కేంద్రాలకు తరలించాలని వివరించారు. గిరి శిఖర గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవ సమయం దగ్గరలో ఉన్న గర్భిణులను వసతిగృహానికి, ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, ఆనకట్టలు తనిఖీ చేయాలని, 24 గంటలు సిబ్బంది అప్రమత్తం కావాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పని చేసేటట్టు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, సబ్ కలెక్టర్లు, జిల్లా, మండల అధికారులు, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.