
ఘనంగా ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ
● విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యం
● సీహెచ్ పావని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర
ఉపాధ్యక్షురాలు
విజయనగరం గంటస్తంభం: రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఘనంగా ముగిశాయి. రెండవ రోజు సమావేశాలకు ముఖ్యఅతిథిగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిందని కానీ ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని విమర్శించారు. సంవత్సర కాలం పాటు సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వానికి గడువు ఇచ్చామని ఆ సమస్యలు తీరకపోవడంతో ఈ ప్లీనరీ సమావేశాల స్ఫూర్తితో ఉద్యమాలు రూపొందిస్తామని హెచ్చరించారు. రాబోయే కాలం పోరాటాల కాలమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వాన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించాలని కోరారు. డిగ్రీలో ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్‌లైన్‌లోనే అడ్మిషన్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజాం, గజపతినరగం, విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. 107,108 జీవోలను రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ల అమ్మకాన్ని ఆపాలన్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సీహెచ్ వెంకటేష్‌లు మాట్లాడుతూ జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్లీనరీ సమావేశాల స్ఫూర్తితో పోరాటం సాగిస్తామని ప్రభుత్వం చొరవ చూపించి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి.చిన్నబాబు, ఒ.రవికుమార్, ఎస్.సమీర, ఎం.వెంకీ, పి.రమేష్, కె రమేష్ జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్.శిరీష, సోమేష్, ఈ వంశీ, కె.రాజు పాల్గొన్నారు.