
జిల్లాలో ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’
● 512 కేసులు నమోదు
● రూ.1,13,900 జరిమానా
విజయనగరం క్రైమ్: విద్యాసంస్థల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్‘ పేరిట చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీలు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు ఆదివారం పలు కాలేజీ యాజమాన్యాలను హెచ్చరించారు. గడిచిన ఐదు రోజుల్లో 512 కేసులు నమోదు చేసి, రూ.1,13,900/ జరిమానాను కోప్టా చట్టం కింద విధించామని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. గడిచిన ఐదు రోజులుగా జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థలకు సమీపంలోని పాన్‌షాపులు, కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించిన 512మంది వ్యాపారులపై కోప్టాచట్టం (ది సిగరెట్స్ అండ్ అదర్ పొగాకు ప్రొడక్ట్‌స్ 2003 చట్టం) ప్రకారం కేసులు నమోదు చేసి, వారిపై రూ.1,13,900/ లను జరిమానా విధించామన్నారు. విద్యాలయాలకు దగ్గరలో ఉన్న పాన్ షాపుల్లోను, కిరాణా షాపుల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం వల్ల విద్యార్థులు వాటిని వినియోగించేందుకు అలవాటుపడి, వక్రమార్గంలో ప్రయాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా చర్యలు చేపట్టేందుకు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు స్వస్తి పలకాలని ఎస్పీ కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు పాల్గొనగా, డీఎస్పీలు పర్యవేక్షించారు.