
వ్యవసాయశాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం శూన్యమే..
రాజాం:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నా ఉత్తరాంధ్ర రైతులకు విత్తన, ఎరువు, సాగునీటి కష్టాలు తప్పడంలేదని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. రాజాంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయకుండా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తోందని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతులు సుభిక్షంగా ఉన్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గిట్టుబాటు ధర లేక మామిడిపండ్లను రైతులు రోడ్లమీద పడేస్తే ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం మాత్రం రాయితీ ఇచ్చి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో చెరకు ఫ్యాక్టరీ ఎత్తివేసే పరిస్థితి వస్తే డీఆర్‌సీ సమావేశంలో నిలదీయడంతో ఆ పరిస్థితి నుంచి తప్పుకుని పత్రికా ప్రకటన చేశారని, కనీసం రైతులును పట్టించుకోని మంత్రి వ్యవసాయశాఖ మంత్రిగా ఉండడం మన దురదృష్టకరమని విమర్శించారు. రెండేళ్లుగా రైతు భరోసా వేయలేని మంత్రి ఏమని ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారో అర్థంకావడంలేదన్నారు.