
మాకు చెప్పాల్సిందే..
స్టాక్ వస్తే
సాక్షి, పార్వతీపురం మన్యం:
‘స్టాక్ వస్తే మాకు చెప్పాల్సిందే. నెలలో ఎన్నిసార్లు వచ్చినా మాకు చెప్పి తీరాలి. స్టాక్ రిపోర్టు చూపించాలి. రావడానికి మాకు అభ్యంతరం లేదు. మేం విసిగిపోం. పిలవడానికి మీకు అభ్యంతరమైతే, సంధ్యారాణి మేడం వద్దకు రా.. తీసుకెళ్తా!’.. ఇదీ అంగన్‌వాడీ కార్యకర్తకు సాలూరు మండలానికి చెందిన ఓ టీడీపీ పంచాయతీ నాయకుడి బెదిరింపు. ‘మేడం, నేను సమావేశం పెట్టినప్పుడు మీ సూపర్‌వైజర్ దగ్గర ఏం చెప్పారు? స్టాక్ వచ్చినప్పుడు రిపోర్టు చూపించాలని చెప్పారా, లేదా?’ అని గదమాయించాడు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతినెలా గుడ్లు, బియ్యం, పాలు, ఇతర సరకులు వస్తుంటాయి. కేంద్రాల్లో వీటిని సక్రమంగా వినియోగిస్తున్నారా, లబ్ధిదారులకు అందిస్తున్నారా, లేదా అన్నది పర్యవేక్షించడం సూపర్‌వైజర్ల విధి. కచ్చితంగా సెంటర్ విజిట్‌లు వారు చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సరకులు వచ్చినప్పుడల్లా తమకు చూపించాలని సాలూరు మండలంలో ఓ టీడీపీ నాయకుడు.. అంగన్‌వాడీ కార్యకర్తను ఫోన్లో బెదిరించిన ఘటన చోటుచేసుకుంది. ‘తల్లీ పిల్లలకు సరకులు పంచినప్పుడు ఏ రోజైనా మమ్మల్ని పిలిచారా? అన్ని పంచాయతీల్లోనూ పిలుస్తున్నారు.
స్టాక్ వస్తున్నప్పుడు ఎందుకు చెప్పడం లేదు. సంబంధిత రిపోర్టు కూడా మాకు చూపించాలి.’ అని ఆ వ్యక్తి.. కార్యకర్తను హెచ్చరించాడు. ‘15 సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను. ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలుంటే.. నాయకులను పిలుస్తాం. సరకులు వచ్చినప్పుడల్లా ఎలా పిలవగలం? రేపు మరో ప్రభుత్వం వస్తే.. వారిని కూడా ఇలానే పిలవమంటారు.’ అని ఆమె నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా... ‘మా ప్రభుత్వ నిబంధన ఇది.. మా మేడం చెప్పారు. పిలవడానికి నీకేమైనా ఇబ్బందా?’ అంటూ ఆమెను గదమాయించడం గమనార్హం. దీంతో సదరు కార్యకర్త ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.
నీకు ఇబ్బందైతే మేడమ్ దగ్గరికి రా..
అంగన్‌వాడీ కార్యకర్తకు ‘తమ్ముడి’ బెదిరింపు