
జీతం బెత్తెడు.. బాధ్యతలు బారెడు!
‘ ఎంఏ, బీఈడీ పూర్తిచేసి విజయనగరం పట్టణంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో 10 సంత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రారంభ దశలో నెలకు రూ.5,500కు విధుల్లో చేరాను. ఇప్పుడు రూ.15వేలు ఇస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు పది గంటలకు పైగా పనిచేయాల్సి వస్తోంది. ఫలితాలు సాధించడంలో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులపైనే ఒత్తిడి అధికం. సెలవులు ఉండవు. అత్యవసర వేళ సెలవు ఇవ్వకుండా ఉండిపోతే అదే ఉద్యోగానికి చివరిరోజు అవుతుంది.’
– ఇదీ ఓ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడి ఆవేదన
‘డిగ్రీ పూర్తి చేశా.. ప్రైవేటు పాఠశాలలో నెలకు రూ.8 వేలు ఇస్తున్నారు. అదీ ప్రతి నెలా ఇవ్వరు. రెండు మూడు మాసాలకు ఒక పర్యాయం చెల్లిస్తున్నారు. పైగా రికార్డుల్లో చూపించి నంత జీతం ఇవ్వడంలేదు. రెవెన్యూ స్టాంపులు వేయించుకొని మరీ సంతకాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో విధిలేక విధులు నిర్వర్తిస్తున్నా..’
– మరో టీచర్ వ్యథ
విజయనగరం అర్బన్: ప్రైవేటు విద్యాలయాల్లో ఉపాధ్యాయ వృత్తి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అధిక పనిభారం వారిని తీవ్రంగా కుంగదీస్తోంది. ఏటా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే యాజమాన్యాలు ఉపాధ్యాయుల వేతనాల విషయంలో మాత్రం శీతకన్ను వేస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలో యాజమాన్యాల ఒత్తిడి, ప్రవేశాల లక్ష్యం వారిని మరింత కలవరపెడుతోందని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం సభ్యులు వాపోతున్నారు. ఇచ్చిన జీతాలతో కుటుంబ జీవనం నెట్టుకోలేక... తప్పనిసరిగా ట్యూషన్స్ చెప్పుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 6 కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు 553 వరకు ప్రైవేటు పాఠశాలలున్నాయి. వాటిలో 7 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు తన భర్త అనారోగ్యం కారణంగా సడన్‌గా సెలవు పెట్టింది. ప్రిన్సిపాల్ సెలవు మంజూరు చేయకపోవడమేకాకుండా ఆ స్థానంలో మరొకరిని నియమించారు.
సెలవు పెడితే వేతనంలో కోత..
జిల్లాలోని మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్నవారికి నెలకు రూ. 5 వేలకు మించి వేతన ఉండదు. పట్టణ పరిధిలోని ప్రైవేటు స్కూళ్లలో అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రతినెలా వేతనాలు చెల్లించే పాఠశాలలు తక్కవగానే ఉన్నట్లు వాపోతున్నారు. అత్యవసర సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు జరిపి బోధకులకు న్యాయం చేయాల్సిన విద్యాశాఖ నిస్తేజంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మిక శాఖ అధికారులు సైతం చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బోధనకంటే ఇతర వేధింపులే ఎక్కువ
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 553 ప్రైవేటు స్కూళ్లు
అందులో పనిచేస్తున్న టీచర్లు 7 వేల మంది
తూతూ మంత్రంగా అధికారుల తనిఖీలు