
వరకట్న వేధింపుల కేసులో ముగ్గురికి జైలుశిక్ష
విజయనగరం క్రైమ్: నాలుగేళ్ల క్రితం విజయనగరంలోని దిశ పోలీస్ స్టేషన్‌లో నమోదైన వరకట్నవేధింపుల కేసులో ముగ్గురు ముద్దాయిలకు విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్ట్ బుధవారం జైలు శిక్ష విధించినట్లు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ గోవిందరావు తెలిపారు. 2021లో విజయనగరం మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో ముద్దాయిలు ముగ్గురికి ఒక ఏడాది సాధారణ జైలు, రూ.51వేల జరిమానా విధిస్తూ విజయనగరం జేఎఫ్‌సీఎం (స్పెషల్ మొబైల్ కోర్టు) న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి తీర్పు వెల్లడించినట్లు డీఎస్పీ ఆర్.గోవింద రావు చెప్పారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని నెల్లిమర్ల మండలం చినబూరాడపేటకు చెందిన యడ్ల మహాలక్ష్మికి గజపతినగరానికి చెందిన ఎన్ని రామకృష్ణతో 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.8 లక్షల కట్నం, 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల సారె సామాన్లు కానుకగా కన్నవారు ఇచ్చారు. వివాహం అనంతరం భర్త ఎన్ని రామకృష్ణ, అతని తల్లిదండ్రులు చిన్నయ్య, సత్యవతిలు అదనంగా మరో రూ.2 లక్షలు కట్నంగా తీసుకురావాలని మహాలక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధించడంతో బాధితురాలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో 2021లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు అప్పటి మహిళా పీఎస్ ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కోర్టు విచారణలో భర్త ఎన్ని రామకృష్ణ (ఎ1), అత్త ఎన్ని సత్యవతి (ఎ2), మామ ఎన్ని చిన్నయ్య (ఎ3) వరకట్న వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో ముద్దాయిలకు పై విధంగా శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి.బుజ్జి తీర్పు వెల్లడించారని డీఎస్పీ వివరించారు.