
ఎరువు కొరత తీర్చండి
● మండల సర్వసభ్య సమావేశంలో
ప్రజా ప్రతినిధుల డిమాండ్
పాచిపెంట: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా ఎరువులు లభించడం లేదని ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం పాచిపెంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బడ్నాన ప్రమీల అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఎరువుల కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న ఎరువులు కొంతమందికే అందుతున్నాయని వాపోయారు. కేరంగి రైతుభరోసా కేంద్రానికి ఎరువులు పంపించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఏ ఒక్క గిరిజన రైతుకు అందలేదని సర్పంచ్ సోముల లచ్చయ్య వ్యవసాయా ధికారి తిరుపతిరావును నిలదీశారు. రాయిగుడ్డివలస రైతు భరోసా కేంద్రానికి ఇంతవరకు ఎరువులు సరఫరా చేయలేదని సర్పంచ్ చింత సీతయ్య అధికారులను ప్రశ్నించారు. ప్రైవేట్ దుకాణాల్లో విక్రయిస్తున్న ఎరువులకు నిర్వాహకులు ఎరువుతోపాటు వారి వద్ద ఉన్న రకరకాల ఎరువులను అంటగడుతున్నారని వైస్ ఎంపీపీ కొల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. దీనిపై ఎంపీపీ మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని, సమయం దాటిన తరువాత ఎరువులను సరఫరా చేసినా ఉపయోగం ఉండదన్నారు. ఈ సందర్భంగా సాలూరు ఏఎంసీ చైర్మన్ ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ ఎరువుల కొరత లేకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, రెండు, మూడురోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. సమావేశంలో ఎంపీడీఓ పాత్రో, వైస్ ఎంపీపీ ఎం.నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.