
సీపీఓ సేవలు అభినందనీయం
పార్వతీపురంటౌన్: జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. జిల్లా ప్రణాళిక అధికారి వీరరాజు ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై వీరరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీరరాజు మంచి సేవాతత్పరతతో వృత్తిని నిర్వహించారని ప్రశంసించారు. అంకితభావంతో సేవలు అందించడం వల్ల మన్ననలు పొందగలరని పేర్కొన్నారు సీనియర్ల సేవలను జూనియర్లు గుర్తించి వారిని మార్గదర్శకంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. రిటైర్ అయిన సీపీఓ పి.వీరరాజు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వృత్తిలో సంతృప్తి పొందానని పేర్కొన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తించేందుకు సహకరించిన కలెక్టర్, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎస్‌ఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.