
రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దుర్మరణం చెందింది. అందాల లోకాన్ని చూడడానికి వెళ్తూ అనంత లోకాలకు పయనమైంది. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిప వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామానికి చెందిన కర్రి నాగమణి(20) తన స్నేహితుడైన విశాఖపట్నం జిల్లా ప్రహ్లాదపురానికి చెందిన దాసరి కార్తీక్ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి అరకు అందాలను తిలకించేందుకు నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై బయల్దేరారు. దాసరి కార్తీక్‌కు చెందిన స్కూటీపై నాగమణి పయనిస్తోంది.కాగా మంగళపాలెం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం డిపోకు చెందిన సిటీ బస్సు స్టాపర్‌ను తప్పించ బోయి స్కూటీపైకి వెళ్లడంతో స్కూటీపై పయనిస్తున్న ఇద్దరూ రోడ్డు అంచున పడిపోయారు. కార్తీక్ కొద్దిగా దూరంగా పడడంతో సురక్షితంగా తప్పించుకున్నాడు. నాగమణి బస్సుపై పడిపోవడంతో తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. నాగమణి విజయనగరంలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మన్మథరావు తెలిపారు.

రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి