
విరమణ వృత్తికే కాని సేవా ధర్మానికి కాదు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వృత్తికే కానీ సేవాధర్మానికి కాదని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన తన కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై పి.సత్యనారాయణ, ఏఎస్సైలు ఎం.సత్యనారాయణ, వేణుగోపాల ప్రాణిగ్రహి, ఆరిక చిన్నయ్య, సత్యవరపు రజనిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌శాఖలో అంకిత భావంతో సేవలందించిన వారి సేవలు పదిలంగా ఉంటాయని ఉద్యోగ విరమణ పొందిన వారు తమ అమూల్యమైన సూచనల మేరకు విధి నిర్వహణలో అనుభవ పూర్వకమైన సందర్భాలను ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పంచుకోవాలని కోరారు. విరమణ అనంతరం వారి శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువాలతో సన్మానించి, జిల్లా కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున జ్ఞాపికలు, చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌బీ సీఐ రంగనాథం, ఏఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, ఏఏఓ సతీష్‌బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.