
ఊరి బడి.. గుండెల్లో అలజడి!
● తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ● గ్రామంలోని పాఠశాలను మరోచోటకు విలీనం చేయవద్దని విజ్ఞప్తి
సాక్షి, పార్వతీపురం మన్యం:
కూటమి ప్రభుత్వం చేపట్టిన స్కూళ్ల విలీనం ప్రక్రియపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నని తల్లడిల్లుతున్నారు. ఏళ్ల తరబడి ఊర్లో ఉన్న బడిని దూరం చేస్తే.. చిన్న వయస్సులో ఉన్న తమ పిల్లలు రహదారులు, కాలువ గట్లు దాటుకుంటూ ఎలా వెళ్లగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలను అంత దూరం పంపలేమని.. టీసీలిచ్చేస్తే మరో చోటకు మార్చుకుంటామని హెచ్‌ఎంలను అడుగుతున్నారు. నెలల తరబడి వీరు పోరాటం చేస్తున్నా.. అధికారులు చలించడం లేదు. ప్రభుత్వం కూడా వీరి మొర వినడం లేదు. ఫలితంగా పిల్లలను బడులకు పంపలేక, విద్యాసంవత్సరం వృథా చేయలేక సతమతమవుతున్నారు. మరికొంతమంది ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు మార్చేస్తున్నారు.
అన్నిచోట్లా ఇదే పరిస్థితి...
పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని యాజమాన్యా ల్లో కలిపి 1,594 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక పాఠశాలలు విలీనం పేరుతో ఊరికి దూరమ వుతుంటే.. అక్కడికి తమ పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజుల కిందట బలిజిపేట మండలం పెదపెంకి–1 పాఠశా ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇదే విషయమై కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి తిరుగు ప్రయాణంలో రహదారి ప్రమాదం బారిన పడ్డారు. ఇప్పటికీ వారి పాఠశాల తెరుచుకోలేదు.
●గరుగుబిల్లి మండలం హిక్కింవలస ఎంపీపీఎస్ లో 3, 4, 5 తరగతులను గరుగుబిల్లి జెడ్పీహెచ్‌ఎస్ లో కలపడంపై గ్రామస్తులు కొద్దిరోజులుగా ఆందో ళనలు చేస్తున్నారు. ఆ తరగతులను గతం మాదిరి కొనసాగించి, హిక్కింవలస ఎంపీపీఎస్‌ను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్చాలని కోరుతున్నారు. గ్రామంలో ఎటువంటి విచారణా చేయకుండానే మార్పు చేశారని ఇప్పటికే మూడు సార్లు అధికారు లను కలిసి వినతిపత్రాలు అందించారు.
●తమ గ్రామంలోని పాఠశాలను తరలించొద్దని పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ పాఠశాలను కొద్దిదూరంలోని తలవరం యూపీ పాఠశాలలో విలీనం చేశారు. దూరం కావడంతో అక్కడికి తమ పిల్లలను పంపేది లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విలీనం పేరుతో గ్రామాలకు దూరమైన పాఠశాలల్లో తల్లిదండ్రులంతా దాదాపు ఇదే ఆవేదనతో ఉన్నారు. ●స్కూళ్లు ప్రారంభమై మూడు వారాలు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ ఆయా పాఠశాలల్లో పిల్లలు తరగతులకు హాజరు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 175 పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఈ ఏడాది ఇంకా విద్యార్థులు చేరలేదని అధికారులు గుర్తించారు. గతేడాది ఒకటో తరగతి చదివిన విద్యార్థుల్లో 173 మంది రెండో తరగతిలో చేరలేదు. 3, 4, 5 తరగతుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. విలీన సమస్యను ప్రభుత్వం పునఃపరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఫౌండేషన్ స్కూల్ వద్దు.. ప్రాథమిక పాఠశాలే ముద్దు
చిత్రంలో కనిపిస్తున్నవారు గరుగుబిల్లి మండలం రావివలస గ్రామస్తులు. తమ ఊరి బడి సమస్యను కలెక్టర్‌కు వివరించేందుకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. ఇక్కడి అంబేడ్కర్ నగర్‌లో ఎంపీపీ పాఠశాల(ఎస్‌డబ్ల్యూ) ఉంది. గతంలో షెడ్యూల్ కులాలు, గిరిజన పిల్లల కోసం.. డ్రాపౌట్లను తగ్గించే ఉద్దేశంతో చాలా ఏళ్ల క్రితం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వీరి పాఠశాలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్చింది. దీనివల్ల 3, 4, 5 తరగతులను మరోపాఠశాలలో విలీనం చేశారు. దీనివల్ల కలిగే ఇబ్బందులను వివరిస్తూ.. బేసిక్ ప్రైమరీ పాఠశాలగానే ఉంచాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
గోడు వినండి సారూ...
కలెక్టరేట్‌కు వచ్చిన వీరంతా ఒకప్పుడు మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితు లు. సుమారు 20 ఏళ్ల కిందట బలిజిపేట మండలం పలగర గ్రామం గుడివాడ కాలనీ, కొట్టిస కాలనీగా ఏర్పడి 500 కుటుంబాల వరకు నివా సం ఉంటున్నాయి. అప్పట్లో ప్రభుత్వం నిర్వాసిత కాలనీ పిల్లల కోసం పాఠశాల నిర్మించింది. తల్లిదండ్రుల్లో అధిక శాతం మంది వ్యవసాయ, సిమెంట్ పనుల కోసం చైన్నె, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిపోతుంటారు. పిల్లలని ఇక్కడే వృద్ధుల వద్ద, బంధువుల ఇళ్లలో ఉంచి చదివిస్తున్నారు. ఇప్పుడు ఆదర్శ పాఠశాల పేరిట నిర్వాసితుల కాలనీ స్కూల్లో ఉన్న పిల్లలను అధికారులు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో శ్మశానం, రెండు చెరువులు, పెదంకలాం కాలువ ఉన్నాయి. చిన్న పిల్ల లు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఇప్పటికే పలుమార్లు డీఈఓ, డీఆర్‌ఓ, కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వారి మొర ఎవరూ వినడం లేదు. సోమ వారం మరోమారు కలెక్టరేట్‌కు వచ్చారు. ‘పాఠశాలల పునఃప్రారంభం నుంచి పిల్లలు బడులకు వెళ్లడం లేదు. వెళ్లినా తిరిగి పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజ నం పెట్టడం లేదు. పోనీ, టీసీలు ఇచ్చేయండన్నా ఎవరూ వినడం లేద’ని విద్యార్థుల తల్లులు ఎల్.జయలక్ష్మి, బౌరోతు లక్ష్మి, గుడివాడ నాగమణి, సంధ్యారాణి, నాగళ్ల లక్ష్మి వాపోయారు.

ఊరి బడి.. గుండెల్లో అలజడి!

ఊరి బడి.. గుండెల్లో అలజడి!