
అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..
● వసతిని విస్మరించిన కూటమి ప్రభుత్వం ● గిరిజనులే సొంతంగా గతంలో రేకుల షెడ్, ఇప్పుడు పూరిపాక నిర్మాణం
మక్కువ:
వారంతా అడవి బిడ్డలు. తమ వలే పిల్లలు నిరక్షరాస్యులు కాకూడదని తలచారు. పిల్లలు చదుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల విద్యాభ్యాసనకు సరైన వసతి లేకపోవడంతో గతంలో రేకులషెడ్ నిర్మించారు. సమస్యను గుర్తించిన గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు శాశ్వతవసతి కల్పించాలని నాడు–నేడు రెండో విడతలో మార్కొండపుట్టి పంచాయతీ కె.పెద్దవలస ప్రాథమిక పాఠశాలకు రూ.37లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణాలు తలపెట్టింది. రూ.10లక్షల విలువైన పనులు జరిపింది. ఇంతలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పునాదుల దశలో ఉన్న పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. తన నియోజకవర్గంలోని పాఠశాల పిల్లలు వసతిలేక ఇబ్బంది పడుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పట్టించుకోకపోవడంతో కె.పెద్దవలస గ్రామస్తులు తల్లడిల్లారు. చివరకు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 52 మంది పిల్లలు విద్యాభ్యాసనకు ఇబ్బంది పడకుండా ఉండాలన్న లక్ష్యంతో శ్రమదానంతో అడవిలో కర్రలు సేకరించారు. విరాళాలు పోగుచేసి గడ్డెను కొనుగోలు చేశారు. సుమారు వారం రోజుల పాటు శ్రమించి ఉపాధ్యాయుల సూచనల మేరకు చక్కని పూరిపాకను నిర్మించారు. దీనిని రెండు, మూడురోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..

అడవిబాట పట్టి.. బడిని తీర్చిదిద్ది..