
చెస్‌పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ
● అంతర్జాతీయ పోటీలకు 21 మంది ఎంపిక
విజయనగరం: ‘సరిలేరు మాకెవ్వరు’ అని నిరూపించారు దివ్యాంగ క్రీడాకారులు. మూడు రోజులుగా జిల్లా వేదికగా జరిగిన 5వ జాతీయ దివ్యాంగుల చెస్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న దివ్యాంగులు తమ ప్రతిభ చాటిచెప్పారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో నగరంలోని మెసానిక్ టెంపుల్‌లో జరిగిన పోటీల్లో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 106 మంది క్రీడాకారులు పాల్గొన్న విషయం విదితమే. శనివారం రాత్రి వరకు 9 రౌండ్ల పోటీలు హోరాహరీగా సాగాయి. అనంతరం 9వ రౌండ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన క్రీడాకారులను ఆయా విభాగాల వారీగా విజేతలుగా ప్రకటించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర, జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం కార్యదర్శి కేవీ.జ్వాలాముఖిలు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను సోల్జర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర మాట్లాడుతూ మానసిక మేధోసంపత్తికి చెస్ వంటి క్రీడాకారులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చన్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగ క్రీడాకారులు ప్రతిభా పాటవాలు చెప్పలేనివని, పోటీల్లో విజేతలుగా నిలిచిన వారితో పాటు పాల్గొన్న వారు విజేతలేనంటూ అభినందించారు. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం జిల్లా కార్యదర్శి కేవీ జ్వాలాముఖి మాట్లాడుతూ జాతీయస్థాయిలో నిర్వహించిన దివ్యాంగుల చెస్ చాంపియన్‌షిప్ పోటీలు మొత్తం 7 కేటగిరీల్లో నిర్వహించామని, ఆయా కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు దక్కించుకున్న వారిని త్వరలో గోవాలో జరగనున్న ప్రపంచస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు రూ.2.30 లక్షల నగదు బహుమతులను అందజేశామని వివరించారు. కార్యక్రమంలో పలువురు చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, అర్బిటర్‌లు, క్రీడాకారులు, వారి తలిదండ్రులు పాల్గొన్నారు.

చెస్‌పోటీల్లో దివ్యాంగుల ప్రతిభ