
చోరీ కేసులో రెండవ నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2017లో డబ్బుల అపహరణ కేసులో రెండవ నిందితుడ్ని ఆదివారం అరెస్ట్ చేసినట్టు వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఆ కేసులో బాధితుడు కర్రి రవీంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, దర్యాప్తు పూర్తి చేశారు. ఆ కేసులో గుత్తి ప్రవీణ్ కుమార్, ఆర్.జయ ప్రకాష్ రెడ్డి, మహమ్మద్ అమీనుద్దీన్, చెల్లి రాజు, బూర రత్నాజీ, విశ్వనాథ్ రెడ్డి సంగీత కన్నన్‌లను ఇదివరకే అరెస్ట్ చేశారు. ఈ కేసులో రెండవ నిందితుడు తమిళనాడుకు చెందిన జీజే శ్రీనివాసులు పరారీలో ఉండగా ట్రాన్సిట్ వారెంట్‌తో విజయనగరం తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజలు రిమాండ్ విధించారని సీఐ శ్రీనివాస్ తెలిపారు.
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి దుర్మరణం
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పీఎస్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని నటరాజ్‌కాలనీకి చెందిన నూకరాజు(41) దుర్మరణం చెందాడు. నూకరాజు ఇంటి నుంచి బైక్‌పై ధర్మపురి వెళ్లాడు. తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో నూకరాజు కింద పడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై అశోక్ తెలిపారు.