
సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్న బాధితుడు
పాలకొండ రూరల్: ఓవైపు పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజలు నేరగాళ్లు, హ్యాకర్ల బారిన పడుతున్నారు. తాజాగా పాలకొండ మండలం సింగన్నవలసకు చెందిన బిల్లకుర్తి ఉపేంద్రకుమార్‌కు సైబర్ వలకు చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 28 న సమీప గ్రామ సచివాలయానికి చెందిన ఓ కార్యదర్శి నంబర్ నుంచి ఓ ‘లింక్’ మెసేజ్ ఉపేంద్రకుమార్ వచ్చింది. గతంలో వలంటీరుగా పనిచేసిన క్రమంలో బహుశా కార్యదర్శి నుంచి ఈ లింక్ వచ్చి ఉంటుందని భావించి ఆ లింక్ ఓపెన్ చేశాడు. ఇంతలో సెల్ ఫోన్‌కు పలుమెసేజ్‌లు వరుసగా వస్తుండడంతో సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే అప్పటికే సెల్ హ్యాక్ కావడంతో స్నేహితులు, బంధువులకు పలు మెసేజ్‌లు వెళ్లాయి. తన ఆరోగ్య పరిస్థతి సరిగా లేదని ఆర్ధిక సాయం చేయాలని ఈ మెసేజ్‌ల సారాంశంగా బాధితుడు తెలుసుకున్నాడు. ఇంతలో తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా ఇదే సెల్‌కు అనుసంధానం చేసి ఉండడంతో వరుసగా నగదు మాయం అవుతుండడం, సమాచారం సెల్‌ఫోన్‌కు మెజేజ్‌ల రూపంలో వస్తుండడంతో ఆందోళన చెందాడు. తన ప్రమేయం లేకున్నా రూ.56వేల పైచిలుకు నదగు పలు దఫాలుగా మాయం కావడంతో ఆదివారం స్థానిక పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు.