
పంచాయతీ కార్యదర్శుల పోరుబాట
–8లో
సాక్షి, పార్వతీపురం మన్యం: తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పలు మండలాల కార్యదర్శులు శనివారం విధులు బహిష్కరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఇక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలూ చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అనుమతి తీసుకురావాలని సూచించారు. దీంతో అక్కడ నుంచి కొంతమంది కార్యదర్శులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. మరికొంతమంది ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్కడా వారి మొర వినేవారు లేకపోవడంతో వెనుదిరిగారు.
ఉదయం 6 గంటలకే విధులా..?
రోజూ ఉదయం 6 గంటలకే గ్రామాల్లో విధులకు హాజరై.. ఇంటింటి చెత్త సేకరణ, క్లోరినేషన్ చేసేటప్పుడు ఆ రోజు దినపత్రికతో ఫొటో దిగి, దానిని పంచాయతీరాజ్ శాఖ పోర్టల్‌లో అప్‌లోడు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కార్యదర్శులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం తమను అవమానించేలా, అవహేళన చేసేలా ఉన్నాయంటూ వాపోతున్నారు. గతంలో వలంటీర్లు చేసిన కొద్దిపాటి సర్వేల భారమంతా తమపైనే వేస్తున్నారని.. దీనికితోడు స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్నుల వసూళ్లు, పీఆర్ వన్ యాప్, రెవెన్యూ వారి పీజీఆర్‌ఎస్ పనులు, గ్రామసభలు, జీపీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రోటాకాల్ వంటివి తామే చేయాల్సి వస్తోందని అంటున్నారు. దీనివల్ల తీవ్ర పని ఒత్తిడితో కుటుంబాలకు దూరమవుతున్నామని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ విధులకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శుల మనోవేదన, విధుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. పని వేళల్లో వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉదయం 6 గంటలకే విధులంటే ఎలా అంటూ ఆవేదన
పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి