
మలేరియాపై అప్రమత్తతే ప్రధానం
● త్వరలో దోమతెరలు పంపిణీ చేస్తాం ● మలేరియా నివారణ జోనల్ అధికారి మీనాక్షి
సీతంపేట: మలేరియా జ్వరాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని మలేరియా నివారణ జోనల్ అధికారి (జెడ్‌ఎంఓ) బొడ్డేపల్లి మీనాక్షి వైద్యులకు సూచించారు. మండలంలోని దోనుబాయి పీహెచ్‌సీ, సీతంపేట ఏరియా ఆస్పత్రులను శనివారం సందర్శించారు. మలేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. మలేరియా వ్యాప్తిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షలు, వైద్యసేవల తీరుపై ఆరా తీశారు. దోనుబాయి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన వసతిగృహ సిక్ రూంను తనిఖీ చేశారు. కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బూర్జగూడలో మలేరియా పాజిటివ్‌తో బాధపడుతున్న వ్యక్తి ఇంటికి వెళ్లి పరీక్షించారు. దోమల వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మలేరియా హైరిస్క్ గ్రామాల్లో విస్తృతంగా ఐఆర్‌ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.ఎస్.ప్రసాద్, డీఎంఓ పి.వి. సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయపార్వతి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, దోనుబాయి వైద్యాధికారి భానుప్రతాప్, సబ్ యూనిట్ ఆఫీసర్ మోహన్‌రావు, కన్సల్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.