
● ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరక
మక్కువ: మండలంలోని శంబర గ్రామంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.70వరకు అధిక ధర వసూలు చేస్తున్నారన్న రైతుల ఆవేదనపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రాంతీయ నిఘా, అమలు అధికారి బి.ప్రసాదరావు ఆదేశాల మేరకు శంబర గ్రామం కొత్తవీధిలో ఉన్న శ్రీ సత్య సాయి ట్రేడర్స్‌ను విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఎరువులు అధిక ధరకు రైతులకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఎరువుల బౌతిక నిల్వలకు, స్టాక్ రిజిస్టర్‌కు వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించారు. ఎఫ్‌సీఓ 1985, 28(1)డి, ఈసీ యాక్ట్ 1955 ప్రకారం కేసు నమోదు చేశారు. రూ.28,77,422లు విలువ కలిగిన 2,399 బస్తాలు (119.925 టన్నులు) ఎరువును సీజ్ చేశారు. దుకాణం స్టాక్ రికార్డులు, తాళాలు, ఈ పాస్ మిషన్‌ను ఏఓ చింతల భారతికి అప్పగించారు. వాటిని జేసీకి సోమవారం అప్పగిస్తామని ఏఓ తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారి రామారావు, సబ్‌ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.