
గురుకులంలో ఇంటర్ విద్యకు మంగళం
● నీట్, ఐఐటీ బ్యాచ్‌ల పేరుతో రెగ్యులర్ ఇంటర్‌ను ఎత్తేశారు
● మూడు దశాబ్దాలుగా కొనసాగిన
తరగతులు జరగవిక
● ఎంపీసీ, బైపీసీ కోసం జిల్లా శివారు
ప్రాంతాలకు పరుగులు
● ఆవేదనలో గ్రామీణ ప్రాంత ఎస్సీ, ఎస్టీ కుటుంబాల బాలికలు
చీపురుపల్లి: ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట’ అన్న చందంగా తయారైంది గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ పరిస్థితి. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు గతంలో ఉన్న సౌకర్యాలు కంటే మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడం చూస్తుంటాం. ప్రస్తుత కూటమి పాలనలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దీనికి పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మూడు దశాబ్దాలుగా ఉన్న రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుకు మంగళం పాడడమే నిదర్శనం. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో విద్యనభ్యసించేందుకు విద్యార్థినులు పోటీ పడేవారు. ఏటా ప్రవేశాల కోసం అధికమంది దరఖాస్తు చేసేవారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ కోర్సులు నిర్వహించడంలేదని తెలియడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన బాలికలు ఆవేదన చెందుతున్నారు. కళాశాల గేటుకు వేటాడుతున్న రెగ్యులర్ ఇంటర్ లేదన్న నోటీస్ బోర్డును చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలను కేవలం నీట్, ఐఐటీ బ్యాచెస్‌కు కేటాయించారని, రెగ్యులర్ ఇంటర్ ఇక్కడ లేదని సిబ్బంది చెబుతున్నారు. నీట్, ఐఐటీ లాంటి ఉన్నత కోర్సులకు వెళ్లే విద్యార్థులు కోసం ప్రత్యేకంగా బ్యాచ్‌లు నడపడం మంచిదే అయినప్పటికీ, రెగ్యులర్ ఇంటర్ పూర్తిగా రద్దు చేయడం అన్యాయమని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్
సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జోనల్ స్థాయిలో ఒక నీట్, ఐఐటీ క్యాంపస్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి చీపురుపల్లి గురుకుల బాలికల కళాశాలలో ఆ క్యాంపస్‌ను ఏర్పాటు చేసి రెగ్యులర్ ఇంటర్‌ను రద్దు చేశారు. ఈ క్యాంపస్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో ఒక్కటే ఉండేది. తాజాగా జోనల్‌స్థాయిలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అది కూడా చీపురుపల్లిలో ఏర్పాటు చేయడంతో రెగ్యులర్ ఇంటర్‌కు మంగళం పాడేలా చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎంట్రన్స్ కూడా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేశారు.
మూడు దశాబ్దాల చరిత్ర..
సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 1984లో చీపురుపల్లి కేంద్రంగా గురుకుల బాలికల పాఠశాలను ఏర్పాటుచేశారు. తరువాత కాలంలో 1994లో గురుకుల బాలికల కళాశాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ కోర్సులను తీసుకొచ్చారు. 31 సంవత్సరాలుగా ఉన్న ఇంటర్మీడియట్ కోర్సు ఇప్పుడిక లేదు. పక్కనే నెలిమర్లలో ఉన్న అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాల ఉన్నప్పటికీ అక్కడ ఎంపీసీ, బైపీసీ గ్రూపులు లేవు. దీంతో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కావాలనుకునే చీపురుపల్లి, నెలిమర్ల, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, రాజాం నియోజవకర్గాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు జిల్లాలోని సుదూరంగా ఉన్న వేపాడ, వియ్యంపేట వంటి గురుకుల కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది.
రెగ్యులర్ ఇంటర్మీడియట్ లేదు....
జోనల్ స్థాయిలో ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ క్యాంపస్‌ను చీపురుపల్లి గురుకుల కళాశాలలో ఏర్పాటు చేశారు. దీంతో రెగ్యులర్ ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి ఇక్కడి సీట్లను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నీట్, ఐఐటీ బ్యాచస్‌కు సంబంధించి సీట్లు కూడా పూర్తయ్యాయి.
– రాణీశ్రీ, ప్రిన్సిపాల్,
గురుకుల కళాశాల, చీపురుపల్లి

గురుకులంలో ఇంటర్ విద్యకు మంగళం