
జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ, సీతం ఇంజినీరింగ్ కళాశాల సంయుక్తంగా జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నామని సీతం ఇంజినీరింగ్ కాలేజి డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు పేర్కొన్నారు. తోటపాలెం సత్య విద్యా సంస్థల వద్ద శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్యుల దినోత్సవం ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. వెద్యులు ప్రాణదాతలని, సమాజంలో వారి స్థానం ఎల్లప్పుడూ గౌరవప్రదంగానే ఉంటుందన్నారు. సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలతో ప్రపంచం ముందుకు వెళ్తుందని ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ అంశాలపై జాతీయ వైద్యుల దినోత్సవం నాడు ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, సత్య డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి దేవమణి తదితరులు పాల్గొన్నారు.
గంజాయి కేసులో ఐదుగురు అరెస్టు
బొండపల్లి: మండలంలోని గొట్లం బైపాస్ రోడ్డు మీదుగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు యువకులతో పాటు గంజాయిని సీజ్ చేసినట్టు సీఐ రమణ, ఎస్‌ఐ మహేష్ శనివారం తెలిపారు. కురుపాంకు చెందిన డి.కీర్తిరాజ్‌కుమార్, పి.అమర్, ఎం.అఖిల్, ఒడిశాకు చెందిన టి.రమేష్, ఇ.శ్యామ్‌లను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1200 గ్రాముల గంజాయి, ఆరు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఈవీఎం గొడౌన్ వద్ద పటిష్ఠ భద్రత : కలెక్టర్
పార్వతీపురం టౌన్: ఈవీఎం గొడౌన్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద గల ఈవీఎం గొడౌన్‌ను ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎం గొడౌన్ భద్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గొడౌన్‌ను పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్టు రాజకీయ పక్షాల ప్రతినిధులకు తెలిపారు. అదే విధంగా ప్రతి మూడు మాసాలకు (త్రైమాసిక) ఒకసారి జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి గొడౌన్‌ను పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వెల్లడించారు. ఈవీఎం గొడౌన్ వద్ద లాగ్ బుక్‌లను పరిశీలించి, లాగ్‌బుక్‌లో అందరికీ అర్థమయ్యేలా వివరాలు నమోదు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.

జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం

జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం