
మంత్రి ఉంటే ఆ మార్గం మూతే..!
● మంత్రి ఇంటి వద్ద ట్రాఫిక్ సమస్య ● రాకపోకలకు ఇబ్బందులు ● మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్న అఫీషియల్ కాలనీవాసులు
సాలూరు: సీ్త్ర శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసముంటున్న సాలూరులోని అఫీషియల్ కాలనీ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆమెను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులు రోడ్డుపైనే వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో కాలనీవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ సమావేశాల సమయంలో నడిచేందుకు కూడా దారి ఉండని పరిస్థితి. రోడ్డుపై నిలిపిన వాహనాలను పక్కకు తీసుకుని తమ వాహనాలతో ముందుకువెళ్లాళ్సి వస్తోంది. సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోతోందని వాపోతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా స్థానికుల సమస్యపై స్పందించని మంత్రి తీరును తప్పుబడుతున్నారు.
రాజన్నదొరకూ దారి కరువే...
అదే మార్గంలో నిరంతరం ప్రయాణించే మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకు కూడా తరచూ ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. మంత్రి సంధ్యారాణి ఇంటిముందు నిలిపిన వాహనాలను పక్కకు తీసి శనివారం వెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మంత్రి తీరును దుమ్మెత్తిపోశారు. ఈ సమస్యపై రాజన్నదొర స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వారి ఇళ్లముందు ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, చొరవ తీసుకుని సమస్యను చక్కదిద్దాలన్నారు. తను డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో బాధ్యతాయుతమైన పాలకుడిగా కాలనీ వాసులకు ఏ ఒక్కరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను రోడ్డు పక్కగా పార్కింగ్ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించేవాడినన్నారు. మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద ఏడాదిగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పట్టణ సీఐకు ఫోన్ చేసి విషయం చెప్పినా సరైన స్పందన లేదన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పోలీసులు, మీడియా వచ్చే వరకు తన వాహనాన్ని ట్రాఫిక్‌లో నిలుపుదలచేస్తానని, అప్పుడు అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు.