
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి
బాడంగి: మండలంలోని డొంకినవలస–బొబ్బిలి రైల్వేస్టేషన్ల మధ్య గొళ్లాది మంగళ గేటు సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. బొబ్బిలి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సుమారు 45ఏళ్ల వయస్సు కలిగిన మహిళను రైలు ఢీకొనడం లేదా జారిపడి పోవడం వల్ల మృతి చెంది ఉంటుందని రైల్వే హెచ్‌సీ ఈశ్వరరావు తెలిపారు. మృతురాలి శరీరంపై ఎరుపు, పసుపు రంగుచీర కలిగి ఉందని, గుర్తు పట్టడానికి ఎటువంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచామని తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఆర్‌పీఎస్‌ఎస్‌ఐ 9490617089 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పాముకాటుతో వృద్ధుడు..
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందిన ఎప్పరిక తిరుపతిరావు(63) పాము కాటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిరావు గ్రామ సమీపంలో పశువుల శాల వద్ద పెంచుతున్న కోళ్లను కప్పేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లగా అక్కడ నాగుపాము కాటేసింది. తిరుపతిరావు ఆ పామును అక్కడే కొట్టి చంపేశాడు. ఇంటికొచ్చి కుటుంబీకులకు తెలియజేయగా వైద్యం నిమిత్తం భద్రగిరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిరుపతిరావు మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం భద్రగిరి ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం నిర్వహించి తిరుపతిరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి